బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే హీరోయిన్లు ఖాయం అయ్యారు. అయితే విలన్ పరిస్థితి ఏమిటన్నది ఇంకా తేలలేదు. బోయపాటి సినిమాలో పవర్ఫుల్ విలన్స్ కనిపిస్తుంటాయి. ఆది పినిశెట్టి, జగపతిబాబు, వివేక్ ఓబెరాయ్... ఇలా ప్రతీ సినిమాలోనూ విలన్ల కోసం పెద్ద నటుల్నే పట్టుకొచ్చారు. ఈసారీ ఓ స్టార్ నే ఈ సినిమాలో విలన్ గా పెట్టాలని బోయపాటి ఫిక్సయ్యాడు. రోల్ కూడా అలాంటి స్టార్‌నే డిమాండ్ చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ప్రతినాయకుడ్ని ఖాయం చేయలేదు.
సంజయ్ దత్, శ్రీకాంత్, రాజశేఖర్, సోనూసూద్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. సంజయ్ దత్‌కి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల.. ఆ పేరు పక్కన పెట్టారు. సోనూసూద్ పారితోషికం భారీగా డిమాండ్ చేయడం వల్ల.. వద్దనుకున్నారు. రాజశేఖర్‌కి ఇటీవలే కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో శ్రీకాంత్‌నే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాడు బోయపాటి. శ్రీకాంత్ అయితే కావల్సినన్ని కాల్షీట్లు ఇవ్వగలడు. పారితోషికం కూడా తక్కువే. పైగా.. బాలయ్యతో శ్రీకాంత్ కి మంచి అనుబంధం ఉంది. అందుకే.. శ్రీకాంత్ నే ఫిక్స్ చేసే అవకాశాలున్నట్టు టాలీవుడ్ టాక్.