కమెడియన్స్ హీరోలుగా అవతారమెత్తడమన్న సాంప్రదాయం ఇప్పటిది కాదు, రాజబాబు కాలం నాటి నుండీ వస్తోంది. పలువురు కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్‌లు అందుకున్న పరిస్థితులు గతంలో చాలా ఉన్నాయి. అయితే కమెడియన్స్ సినిమాల్లో డాన్సులకు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి.
నాటి కాలంలో రాజబాబు డాన్సులేశాడు. బాబూ మోహన్ కూడా డాన్సులేసి మరీ హీరోయిజం చూపించాడు. అయితే కమెడియన్ ఆలీ హీరోగా నటించిన సినిమాల్లో డాన్సులకు ప్రత్యేక స్థానం ఉంది. తర్వాత ఈ జనరేషన్‌లో సునీల్ హీరోలకు ధీటుగా డాన్సులేసి అలరించాడు. ఈ మధ్య కామెడీ ఎక్స్‌ప్రెస్ నుండి హీరోయిజం ఎక్స్‌ప్రెస్ ఎక్కిన సప్తగిరి కూడా డాన్సులు ఇరగదీసి ఆడియన్స్ మెప్పు పొందాడు. అలా కమెడియన్స్ కమ్ హీరోస్ అసలు సిసలు హీరోయిజంకు మేమేం తక్కువ కాదని నిరూపిస్తూనే ఉన్నారు.
కాగా తాజాగా మరో కమెడియన్ కమ్ హీరో డాన్సులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆయన ఎవరో కాదు, మాంచి టైమింగ్ ఉన్న కమెడియన్‌గా పాపులర్ అయ్యి, 'గీతాంజలి' సినిమాతో హీరోగా అవతారమెత్తిన శ్రీనివాస్ రెడ్డి. తొలి సినిమా 'గీతాంతజలి'తో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' కూడా హీరోగా శ్రీనివాసరెడ్డి కెరీర్‌లో మంచి విజయాన్ని వరించేలా చేసింది. తాజాగా శ్రీనివాస్ రెడ్డి హీరోగా వస్తున్న చిత్రం 'జంబలకిడి పంబ'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
లేటెస్టుగా వచ్చిన సాంగ్ ప్రోమోతో శ్రీనివాస్ రెడ్డి డాన్సుల టాలెంట్ బయటపడింది. హీరో అన్నాక అన్నీ చెయ్యాలి కదా. అందుకే డాన్సులు కూడా ట్రై చేసేశాడీసారి శ్రీనివాస్ రెడ్డి. ప్రొఫిషనల్ డాన్సర్‌లా స్టెప్పులు ఇరగదీసేస్తున్నాడు. పాపులర్ టైటిల్ అయిన 'జంబలకిడిపంబ'ని తన కొత్త సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని నవ్వులు పండిస్తానంటున్న శ్రీనివాస్ రెడ్డి ఎంత మేర ఆకట్టుకుంటాడో చూడాలి మరి.