కరోనా నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌కి చాలా ఇబ్బంది వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఇంట్రో ప్రోమో’ విడుదల చేసే విషయంలో జరిగిన హంగామా, చివరికి వచ్చిన ఔట్ పుట్ పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని నెలలు ఎదురుచూసింది ఈ ‘ప్రోమో’ కోసమా? అని యంగ్ టైగర్ అభిమానులు కూడా బాధపడుతున్న వైనం సోషల్ మీడియా వేదికగా కనిపిస్తోంది. నిజమే, రాజమౌళి మీద చాలా చాలా ప్రెజర్ వుంది. ఎంతటి ఒత్తిడిలో అయినాసరే, బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వడం రాజమౌళికి కొత్త కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. టెక్నీషియన్స్ లభ్యత కరోనా కారణంగా తగ్గింది. కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా షూట్ చేసి మరీ, ఈ ఔట్‌పుట్‌ని తీసుకొచ్చారు.
ఈ క్రమంలో చిన్నపాటి ‘వెలితి’ అయితే అందరికీ కనిపిస్తోంది. కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి నేపథ్యంలో రాజమౌళి నుంచి ఇలాంటి ఔట్‌పుట్ రావడమే చాలా గొప్ప విషయం. ఏదో ఒక అప్‌డేట్ లేకపోతే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ అభిమానులు, అందునా యంగ్ టైగర్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని సీన్స్‌ని రాజమౌళి యూ ట్యూబ్ నుంచి కాపీ కొట్టేశాడంటున్నారు. ఏ గొప్ప అద్భుతాన్ని సృష్టించినా, అది దేనికో ఒకదానితో పోలిక వుంటుంది. అంతెందుకు, హాలీవుడ్ ఫిలిం ‘అవతార్’ విషయంలోనే ఈ కాపీ ఆరోపణలు తప్పలేదు. ఎవరో గిట్టనివారు చేస్తున్న దుష్ప్రచారం తప్ప, రాజమౌళిని తక్కువ చేయడానికి వీల్లేదన్నది ఇంకొందరి అభిప్రాయం.