సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా `ఉప్పెన`. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమాపై మైత్రీ మూవీస్ భారీగా ఖర్చు పెట్టింది. దాదాపు 25 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు బాగా వస్తున్నాయి. అమేజాన్ వాళ్లు 13 కోట్లకు ఈ సినిమా బేరం పెట్టార్ట. అయితే ఆ మొత్తానికి అమ్మితే గిట్టుబాటు అవ్వదు. అందుకే సుకుమార్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడట.
ఈ సినిమాని రెండు భాగాలుగా చేసి, ఒకొక్క భాగం 10 కోట్లకు అమ్మినా... పెట్టుబడి తిరిగి వస్తుందని భావిస్తున్నాడు. బుచ్చిబాబు తీసిన ఫుటేజ్ ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకూ 3 గంటల సినిమాల లెక్క తేలిందట. ఒక్కొక్క సినిమాని 90 నిమిషాలకు కుదించి, రెండు భాగాలుగా తీస్తే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడు. మరి ఒకే సినిమాని రెండు భాగాలు గా చేసి ఇస్తే.. ఓటీటీ వాళ్లు కొంటారా? అనే డౌటు ఉంది. ఈ విషయాన్ని ముందుగానే చెప్పేసి, ఓటీటీ వాళ్లని ఒప్పించి - అప్పుడు రెండు భాగాలుగా కట్ చేద్దామని భావిస్తున్నార్ట. మొత్తానికి సుక్కు ఐడియా అదిరిపోయింది. మరి ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.