'లేడీస్ టైలర్' అంటే గుర్తుంది కదా. అంత సులువుగా మర్చిపోయే సినిమా కాదది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రమది. అప్పట్లో ఎంత సూపర్ డూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి ఎప్పట్నుంచో సీక్వెల్ ప్లాన్ చేస్తూనే ఉన్నారు. కానీ కుదరలేదు. ఎట్టకేలకు వంశీ డైరెక్షన్‌లోనే ఆ సినిమాకి సీక్వెల్ సెట్ అయ్యింది. హీరోగా సుమంత్ అశ్విన్‌ని తీసుకున్నారు. 'లేడీస్ టైలర్' సినిమాలో ఆ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ మెయిన్ అట్రాక్షన్ కాగా, ఈ సినిమాలో 'ఫ్యాషన్ డిజైనర్' సన్నాఫ్ లేడీస్ టైలర్‌గా రాబోతున్నాడు సుమంత్ అశ్విన్. ప్రముఖ కామెడీ హీరోల్లో ఎవరితోనైనా ఈ సినిమాని తెరకెక్కించాలని భావంచారు. కానీ చివరికి ఆ క్యారెక్టర్‌లో నటించేవాడు కాదు జీవించేవాడు కావాలని సుమంత్ అశ్విన్‌ని ఎంచుకున్నారు. నేచురల్ యాక్టింగ్‌తో సుమంత్ ఈ క్యారెక్టర్‌ని మెప్పించేస్తాడట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'లేడీస్ టైలర్' ఫ్లేవర్ ఏమాత్రం మిస్ కాకుండా వంశీ ఈ సినిమాని తెరకెక్కించారట. అలాగే వంశీ మార్కు లొకేషన్స్, కథా, కథనం అన్నీ ఈ సినిమాకి చక్కగా కుదిరాయంటున్నారు. మణిశర్మ సంగీతం అందించిన బాణీలు సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో.