బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సన్నీలియోన్ ఓ పాపకి తల్లయ్యింది. అంటే తల్లి కావాలంటే సహజంగా నవమాసాలు మోసి కంటేనే తల్లి అవుతారనే ఆలోచనలో ఉంటే మీరు తప్పులో కాలేసినట్లే. అంటే సన్నీ నవమాసాలు మోసి బిడ్డని కనలేదు. ఓ అనాధాశ్రమం నుండి ఆడబిడ్డని దత్తత తీసుకుంది. తద్వారా ఆమె ఆ బిడ్డకి తల్లయ్యింది. మహారాష్ట్రలోని లాతూర్‌లోని ఓ అనాధాశ్రమం నుండి 21 నెలల ఆడ బిడ్డని సన్నీ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ పాపకి నిషా కౌర్ వెబర్ అనే పేరు పెట్టారు. సన్నీ అసలు పేరు కరణ్‌జీత్ కౌర్ వోరా అట. ఆమె భర్త పేరు వెబర్, ఈ రెండు పేర్లు కలిసేలా పాపకి నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు. సన్నీ లియోన్ అంటే శృంగార తారగానే అందరికీ తెలుసు. కానీ సన్నీలోనూ ఇంత మంచి మనసు ఉందని ఇప్పుడే తెలిసింది. ఓ సారి అనుకోకుండా అనాధాశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడి వారు ఆ అనాధ పిల్లలకు చేసే సేవలు చూస్తే తానూ ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుందట. అందులో భాగంగానే రెండేళ్ల క్రితం అనాధాశ్రమంలో తమ దంపతుల పేర్లు నమోదు చేసుకున్నారట. అలా ఓ పాపకి తల్లిదండ్రులయ్యారు సన్నీ దంపతులు. ఆ పాప రాకతో సన్నీ కుటుంబం సంతోషంతో నిండిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తోంది. తెలుగులో సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తోంది. రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతోన్న 'గరుడ వేగ' సినిమా అది. హిందీలో 'బాద్‌షాహో', 'తేరా ఇంతిజార్' చిత్రాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ సన్నీలియోన్.