కరోనా ప్రతికూల సమయంలో థియేటర్స్ కి జనం వస్తారా లేదా అనుమానంలో విడుదలకు రెడీ అయిన సినిమాలు వెంకటేష్ నారప్ప, దృశ్యం 2. ఓటీటీలో విడుదల చేస్తే మంచి టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలకి థియేటర్లో నిలబడే శక్తి వుంది. థియేటర్స్ కి వచ్చివుంటే మరింత మంచి ఫలితం వుండేది. ఇప్పుడు ఇదే విషయంలో కాస్త పశ్చాత్తాపం వ్యక్తం చేశారు నిర్మాత సురేష్ బాబు.
''నారప్ప థియేటర్స్ లోకి రావాల్సింది. అయితే జనం ఎంతమంది వస్తారో అనే భయం వుండేది. ఒకవేళ జనం రాకపోతే పెద్ద మొత్తంలో నష్టం వచ్చే అవకాశం వుంది. మా పార్ట్నర్ నిర్మాత కూడా వుండటం వలన ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ కేవలం సురేష్ ప్రొడక్షన్ ఒక్కటే వుంటే.. పొతేపోనీ థియేటర్ లోనే విడుదల చేద్దామనే నిర్ణయానికి వచ్చేవాళ్ళం. వెంకటేష్ మాత్రం దృశ్యం ఓటీటీకి ఇచ్చేసిన నారప్ప మాత్రం థియేటర్ లో విడుదల చేయమని చెప్పారు. నారప్ప. దృశ్యం 2.. రెండు సినిమాలు బావున్నాయి. థియేటర్స్ లో బాగా ఆడేవి. ఈ విషయంలో చిన్న పశ్చాత్తాపం వుంది'' అన్నారు సురేష్ బాబు.