ఇటీవల కాలంలో వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్న తమిళనాడుకు `విక్రమ్` రూపంలో ఓ సూపర్ హిట్టు వచ్చి చేరింది. గత సినిమా రికార్డులన్నీ.. `విక్రమ్` బద్దలు కొడుతూ... కమల్ హాసన్ స్టామినాకు అద్దం పట్టింది. దేశమంతా ఇప్పుడు విక్రమ్ గురించీ, అందులో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చూపించిన పాత్రల గురించీ మాట్లాడుకుంటున్నారు. `విక్రమ్ 2` గురించి కూడా ఆరా తీస్తున్నారు. విక్రమ్ క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విక్రమ్ 2 తీస్తే... అందులో సూర్య కనిపిస్తాడని, విక్రమ్ 2లో రోలెక్స్ పాత్రే హైలెట్ అవ్వబోతోందని తమిళనాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి... రోలెక్స్ అనేది విలన్ పాత్ర కాదట. అది హీరో పాత్ర అట. అదే విక్రమ్‌లో అసలైన ట్విస్ట్.
లోకేష్ కనగరాజ్ కొన్ని పాత్రల్ని, ఆ పాత్రల చుట్టూ కథల్ని తయారు చేసుకొన్నాడు. అవే ఢిల్లీ, విక్రమ్, రోలెక్స్. ఒక్కో సినిమా ఒక్క ఓపాత్ర చుట్టూ తిరుగుతుంది. ఎవరికి వాళ్లే హీరోలు. వాళ్లంతా మిగిలిన కథల్లోనూ తళుక్కున మెరుస్తుంటారు. ఇది విక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్. రోలెక్స్ పేరుతో విక్రమ్ ఓ కథ తయారు చేసుకొన్నాడట. అది సూర్య కోసం రాసుకొన్న కథ అట. త్వరలోనే సూర్యతో రోలెక్స్ పేరుతో ఓ సినిమా తీయబోతున్నాడని టాక్. మరి విక్రమ్ 2లో రోలెక్స్ కనిపిస్తాడా, అక్కడ కూడా రోలెక్స్ ని అతిథి పాత్రగానే చూపిస్తాడా? లేదంటే తాను రాసుకొన్న మరో హీరో పాత్రని... ఈ సినిమా కోసం విలన్ గా మార్చేస్తాడా? అనే విషయాలు తెలియాంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.