చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ అంతకంతకూ లేటవుతూ వస్తోంది. ఆగష్టులో సినిమా రెగ్యులర్ షూటింగ్ అన్నారు. కుదరలేదు. దీపావళి తర్వాత సెట్స్ మీదికి వెళుతుందనుకున్నారు. కానీ అది కూడా కుదరలేదు. అయితే డిశంబరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పక్కా అనేది తాజా సమాచారమ్. అసలింతకీ ఈ సినిమా ఎందుకింత ఆలస్యం కావస్తోంది అంటే ఇదో చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. చాలా ప్రెస్టీజియస్ మూవీ. సో ఈ సినిమాకి సెట్స్ అత్యంత కీలకం. అందుకే సెట్స్ ఏర్పాటు విషయంలో జాప్యం కావడంతోనే షూటింగ్ లేటవుతోందనీ చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారమ్. ఈ సెట్స్ ఏర్పాటు నవంబర్‌కల్లా పూర్తి కావచ్చునట. డిశంబర్‌లో సినిమా షూటింగ్ మొదలవుతుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ నుండే కాక, బాలీవుడ్, కోలీవుడ్ నుండీ ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించనున్నారనీ సమాచారమ్. బాలీవుడ్ నుండి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చిరంజీవి గెటప్, బాడీ లాంగ్వేజ్ అంతా కొత్తగా ఉండబోతున్నాయి. ఇప్పటికే చిరు గెటప్ విషయంలో చిత్రయూనిట్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.