2018 చివర్లో.. సినిమాలన్నీ వరుస కడుతున్నాయి. వారానికి రెండు మూడైనా వచ్చిపోతున్నాయి. ఈ వారం కూడా.. సినిమాల జోరు ఎక్కువగానే కనిపించింది. బాక్సాఫీసు మీదకు ఒకేసారి నాలుగు సినిమాలు దండెత్తాయి. అందులో ఓ డబ్బింగ్ బొమ్మ కూడా ఉంది. మరి ఈ నాలుగు సినిమాల రిజల్ట్ ఏమిటి? ప‌్రేక్షకులు ఏ సినిమాకి ఓటేశారు?
ముందుగా భైరవగీత గురించి చెప్పుకోవాలి. రాంగోపాల్ వర్మ ఇచ్చిన పబ్లిసిటీతో ఈసినిమా హైప్ తెచ్చుకుంది. ట్రైలర్లు, పాటలు కూడా ఆకట్టుకోవడంతో ఈసినిమాలో ఏదో ఉందనిపించింది. కొత్త దర్శకుడు సిద్దార్థ్ అచ్చం తన గురువు రాంగోపాల్ వర్మ స్టైల్‌లో తీసిన సినిమా ఇది. మేకింగ్, టేకింగులకు మంచి పేరే వచ్చింది. అయితే పాత కథ కావడం, కథనం నీరసంగా ఉండడంతో... బాక్సాఫీసు దగ్గర అంతంతమాత్రంగానే నిలబడింది. అయితే.. మిగిలిన నాలుగు సినిమాలతో పోలిస్తే.. వసూళ్లు ఈ సినిమాకే బాగున్నాయి.
హుషారు ఓ యూత్ ఫుల్ మూవీ. అంతా కొత్తవాళ్లే. దర్శకుడితో సహా. అయితే కుర్రకారుకి కావల్సిన అంశాల్ననీ ఈ సినిమాలో ఉన్నాయి. రాహుల్ రామకృష్ణ చేసిన కామెడీ హుషారుకి మరింత హుషారు తెచ్చిపెట్టింది. అక్కడక్కడ నెమ్మదించిన కథనం, రటీన్ సన్నివేశాలు, లాజిక్ లేని కథనంతో హుషారు కొన్నిసార్లు బోర్ కొట్టించింది. అయితే కొత్త దర్శకుడిలో ప్రతిభ ఉందన్న సంగతి మాత్రం చిత్రసీమకు అర్థమైంది. మొత్తానికి ఇదో కాలక్షేపం సినిమాగా నిలిచిపోయింది.
మన్యం పులి తరవాత.. మోహన్‌లాల్ మలయాళ డబ్బింగులకు ఇక్కడ డిమాండ్ పెరిగింది. విడుదలకు ముందే.. మంచి రేట్లు గిట్టుబాటు అవుతున్నాయి. `ఒడియన్` కూడా అలా వచ్చినదే. మోహన్ లాల్ సినిమా అనగానే ఏదో ఉంటుందని ఆశించి, థియేటర్లకు వెళ్తారు. అలా వెళ్లిన వాళ్లని పూర్తిగా నిరాశపరిచాడు మలయాళ సూపర్ స్టార్. యాక్షన్ సన్నివేశాల్లో భారీదనం మినహాయిస్తే.. ఈ సినిమాలో మరేం లేకపోయింది. మోహన్ లాల్ కూడా మరీ ఇలాంటి రొటీన్ కథ ఎంచుకుంటాడా.. అనిపించుకునేలా సాగిందీ చిత్రం. వసూళ్లు కూడా అంతంత మాత్రమే.
ఇదే వారంలో విడుదలైన అనగనగా ఓ ప్రేమకథ పూర్తిగా ప్రేక్షకుల నిర్లక్ష్యానికి గురైంది. మిగిలిన మూడు సినిమాల మధ్య నలిగిపోయింది. కలక్షన్లు లేక థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా రొటీన్ ప్రేమకథగా మిగిలిపోయింది. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, నటీనటులు పూర్తిగా కొత్తవాళ్లు కావడం.. ఈ చిత్రానికి శాపంగా మారాయి.