వేసవి సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. అందుకే సినిమాలన్నీ వరుసకడుతున్నాయి. అందులో భాగంగా ఈవారం నాలుగు సినిమాలొచ్చేశాయి. అందులో ఓ డబ్బింగ్ బొమ్మ కూడా ఉంది. మరి ఈ వారం బాక్సాఫీసు జాతకం ఎలా ఉంది? ప్రేక్షకులు ఏ సినిమాకి ఓటేశారు? ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా `గేమ్ ఓవర్`. తాప్సి కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఇదో థ్రిల్లర్. దర్శకుడు ప్రేక్షకుల బుర్రకు పదును పెడుతూ తీసిన సినిమా ఇది. తాప్సి నటన హైలెట్‌గా నిలిచింది. సాంకేతిక వర్గం పనితీరు కూడా బాగుంది. అక్కడక్కడ స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టినా - థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు తప్పకుండా గేమ్ ఓవర్ నచ్చుతుంది.
మల్టీప్లెక్స్‌ప్రియులకు గేమ్ ఓవర్ మంచి ఛాయిస్. అయితే ఈ సినిమాకి వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూడు భాషల్లో విడుదల చేశారు కాబట్టి - తప్పకుండా ప్రాఫిటబుల్ వెంచర్ అనే చెప్పాలి. హాస్యనటుడు సప్తగిరి కథానాయకుడిగా చేసిన మరో ప్రయత్నం `వజ్రకవచధర గోవింద`. ఓ వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. సప్తగిరి నుంచి ఆశించే కామెడీ తక్కువైపోవడం, ఎమోషన్‌కి పెద్ద పీట వేయడంతో తూకం తప్పింది. తొలి సగం పాసైపోయినా, ద్వితీయార్థం బాగా ఇబ్బంది పెట్టింది. దానికి తగ్గట్టే ధియేటర్లు కూడా ఖాళీగా బోసిబోతున్నాయి. సీ సెంటర్లలో మాత్రం కాస్త టికెట్లు బాగానే తెగుతున్నాయి.
కథల విషయంలో, తన పాత్రల విషయంలో సప్తగిరి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికను ఈ సినిమా జారీ చేసింది. విశ్వామిత్ర, ఐలవ్ యూ సినిమాల సంగతి సరే సరి. వీటికి పబ్లిసిటీ అస్సల్లేదు. ఈ సినిమాలు విడులయ్యాయన్న సంగతీ సగటు ప్రేక్షకుడికి చేరలేదు. విశ్వామిత్ర ఓ థ్రిల్లర్. కానీ ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగింది. ఉపేంద్రకు తెలుగులో అభిమానులున్నారు. ఉపేంద్ర సినిమా వస్తే - తప్పకుండా థియేటర్లలో వాలిపోతారు. అలాంటివాళ్లకూ `ఐ లవ్ యూ` ఏమాత్రం నచ్చలేదు. ఈ రెండు సినిమాలకూ థియేటర్ల అద్దెలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.