`సైరా` తరవాత సరైన సినిమా ఏదీ బాక్సాఫీసు దగ్గరకు రాలేదు. వచ్చినా... ఏదీ నిలబడలేకపోతోంది. ఓ పెద్ద హిట్టు తరవాత.. కొంతకాలం చిత్రసీమలో ఓ స్థబ్దత ఏర్పడుతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. `సైరా` తరవాత ఎన్ని సినిమాలొచ్చినా.. విజయం మాత్రం టాలీవుడ్ దరికి చేరలేదు. ఈవారం అయిదు సినిమాలొస్తే, అన్నీ ఫట్ మన్నాయి. రాజుగారి గది 3, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, మళ్లీ మళ్లీ చూశా, సరోవరం, కృష్ణారావు సూపర్ మార్కెట్ ఈ వారం విడుదలయ్యాయి. అన్నీ నిరాశాజనకమైన ఫలితాల్ని మూటగట్టుకున్నాయి.
రాజు గారి గది పైన కొన్ని ఆశలుండేవి. అవన్నీ నీరుగారిపోయాయి. ఓంకార్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలూ బాగానే ఆడాయి. పార్ట్ 3 మాత్రం దారుణంగా బెడసి కొట్టింది. ప్రధమార్థం నత్తనడకగా సాగింది. ద్వితీయార్థంలో నవ్వులూ పండలేదు. దాంతో.. ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఆది సాయికుమార్ నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా ఈ వారమే విడుదలైంది. ఈ సినిమాని పట్టించుకున్న నాధుడే లేడు. సరైన పబ్లిసిటీ లేకపోవడం కూడా బాగా దెబ్బకొట్టింది. దానికి తోడు ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో యాక్షను, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రెండూ మిస్ అయ్యాయి. ఇక మళ్లీ మళ్లీ చూశా, సరోవరం, కృష్ణారావు సూపర్ మార్కెట్... ఇవన్నీ అసలు విడుదలయ్యాయన్న సంగతే ప్రేక్షకుడికి తెలీలేదు. వీటికి కనీసం 20 శాతం టికెట్లు కూడా తెగలేదు.
ఈ రోజుల్లో పెద్ద స్థాయిలో ప్రచారం జరగాలి. లేదంటే విడుదలయ్యాక ఆ సినిమా గురించి జనం మాట్లాడుకోవాలి. ఈ లక్షణాలు లేకపోతే, ఎంత కష్టపడినా ఫలితం ఉండదని చెప్పడానికి ఈ వారం వచ్చిన సినిమాలే పెద్ద ఉదాహరణలు. వచ్చేవారం దీపావళి హడావుడి మొదలవుతుంది. ఈ దీపావళికి తెలుగు నుంచి సినిమాలేం లేవు. విడుదల అవుతున్న రెండూ డబ్బింగ్ బొమ్మలే. కాకపోతే.... విజయ్, కార్తి సినిమాలు మంచి బజ్‌లో విడుదల అవుతున్నాయి. సో.. ఖైదీ, విజిల్‌లపై కొన్ని ఆశలు పెట్టుకోవచ్చు.