సాహో సందడి తగ్గాక.. గ్యాంగ్ లీడర్‌తో బాక్సాఫీసుకు కాస్త ఊపొస్తుంది అనుకన్నారు. కానీ.. ఆ సినిమా బిలో యావరేజ్ తో సరిపెట్టుకుంది. సైరా వరకూ.. మళ్లీ వసూళ్ల మోత మోగదనుకుంటే ఇప్పుడు 'వాల్మీకి'తో మళ్లీ కాస్త జోష్ కనిపిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం 'వాల్మీకి'. అయితే ఈ పేరు ఇప్పుడు 'గద్దల కొండ గణేష్'గా మార్చారు. కాకపోతే ఇప్పటికీ ఈ సినిమా `వాల్మీకి`గానే చలామణీలో ఉంది.
ఈ సినిమాతో పాటు తమిళ అనువాద చిత్రం `బందోబస్త్` ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండు సినిమాల జాతకాలేంటి? `గద్దలకొండ గణేష్`గా వరుణ్ తేజ్ విశ్వరూపం చూపించేశాడు. మాస్‌కి నచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దడంలో హరీష్ శంకర్ సఫలం అయ్యాడు. దాంతో `గద్దలకొండ గణేష్`కి మంచి ఓపెనింగ్ దొరికింది. తొలి రోజు 5.5 కోట్లతో స్ట్రాంగ్‌గా మొదలైన ఈ సినిమా, రెండో రోజు మరో 4 కోట్లు తెచ్చుకోగలిగింది. విలన్ క్యారెక్టరైజేషన్, కామెడీ, పాటలు ఇవన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. ద్వితీయార్థం కాస్త స్లో అయ్యింది.
లెంగ్త్ కూడా ఎక్కువగానే కనిపించింది. ఈ లోపాలు మినహాయిస్తే... జిగడ్తాండ రీమేక్‌ని సాఫీగానే తీశాడు దర్శకుడు. ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్ అయ్యాయి. మొత్తానికి `గద్దలకొండ గణేష్` హిట్ బొమ్మగానే కనిపిస్తున్నాడు. ఆదివారం కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. వీక్ డేస్‌లో నిలబడుతుందా? లేదా అనే విషయాన్ని బట్టి.. ఆర్థిక విజయం ఆధారపడి ఉంటుంది. ఇక `గద్దలకొండ`కు పోటీగా వచ్చిన చిత్రం `బందోబస్త్`.
సూర్య - కెవి ఆనంద్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రమిది. మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రలు పోషించారు. గత కొంతకాలంగా సూర్య సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతున్నాయి. `బందోబస్త్` కూడా అదే జాబితాలో చేరిపోతుంది. కథ, కథనాలలో బలం లేకపోవడం, ద్వితీయార్థంలో లాజిక్కులు లేకపోవడం ఈ సినిమాకి ప్రధానమైన ప్రతికూలాంశం. ఓపెనింగ్స్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవు. సూర్య సినిమాలకు బీ, సీ సెంటర్లే ప్రధాన ఆదాయ వనరులు. అయితే అక్కడ `గద్దల కొండ గణేష్` థియేటర్లు బాగా నిండుతున్నాయి. `బందోబస్త్` వసూళ్లు మాత్రం నీరసంగా సాగుతున్నాయి.