కథానాయికల రెమ్యునరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. సినిమా మొత్తమ్మీద 10 శాతం కూడా కనిపించరు. కానీ కోట్లకు కోట్లు పారితోషికాలుగా అందుకుంటారు. `మీ పారితోషికం ఎంత` అని ఏ హీరోయిన్‌ని అడిగినా.. మా మేనేజర్ అడగండనో, లేదా మా మమ్మీని అడగండనో చెబుతారు. ఎందుకంటే... అసలు కీ అంతా వాళ్ల దగ్గర ఉంటుందన్నమాట. కొంతమందైతే నేరుగానే డీల్ చేస్తుంటారు. కానీ ఎంత అన్న విషయం చచ్చినా చెప్పారు. మీ పారితోషికం ఇంత అట కదా? అని ప్రశ్నించినా సమాధానం ఇవ్వరు. పారితోషికం గొడవెందుకు? మంచి పాత్ర వస్తే చాలు అని తప్పించుకుంటారు. కానీ తమన్నా మాత్రం `మా పారితోషికాల గొడవెందుకు` అంటోంది.
ఈ ప్రశ్న హీరోల్ని ఎందుకు అడగరు? అంటూ మండి పడుతోంది. హీరోలు కోట్లకు కోట్లు అందుకున్నా, ఎవ్వరూ ఏమీ అడరని, అది వాళ్ల క్రేజ్ అని సంతృప్తి పడిపోతారని, అదే ఓ కథానాయిక రెండు కోట్లు తీసుకుంటే మాత్రం దానికి హైప్ క్రియేట్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. హీరోలకు కోరినంత పారితోషికాలు ఇచ్చినప్పుడు తప్పు కనిపించందని, అదే తాము డిమాండ్ చేస్తే మాత్రం దాని చుట్టూ బోలెడండ కథలు అల్లేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. హీరోలూ హీరోయిన్లూ ఇద్దరూ సమానమే అని, హీరోలు ఎంత కష్టపడి ఎదుగుతారో, హీరోయిన్లూ అంతే కష్టపడతారని, వాళ్ల కష్టాన్ని గుర్తించాలని కోరుకుంటోంది. మొత్తానికి హీరోలపై తనకున్న కోపాన్ని, జెలసీనీ ఈ రకంగా చూపించుకుంది తమన్నా. అయితే.. తన పారితోషికం ఎంతన్నది మాత్రం చెప్పలేదు.