చిత్రం: ఓదెల 2
దర్శకత్వం: అశోక్ తేజ
కథ - రచన: సంపత్ నంది
నటీనటులు: తమన్నా, హెబ్బాపటేల్, వశిష్ఠ ఎన్.సింహా, మురళీ శర్మ, శరత్ లోహితాశ్వ, యువ, నాగ మహేశ్ తదితరులు.
నిర్మాతలు: డి. మధు
సంగీతం: బి.అజనీశ్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ : సౌందరరాజన్
ఎడిటర్: అవినాశ్
బ్యానర్: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్
విడుదల తేదీ: 17 ఏప్రిల్ 2025
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
భోళా శంకర్ సినిమా తరవాత తెలుగులో తమన్నా నటించిన సినిమా 'ఓదెల2 '. ఈ మూవీలో తమన్నా లేడి అఘోరాగా నటించింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. నాగ సాధువుకి ఆత్మలకు మధ్య జరిగిన పోరు ఓదెల 2 . ఓదెల మొదటి పార్ట్ కరోనా టైం లో వచ్చి OTT లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓదెల 2 తెరకెక్కింది. ఫస్ట్ నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. అనుష్క కెరియర్ కి అరుంధతి సినిమా చాలా ప్లస్ అయ్యింది. ఇప్పడు ఓదెల 2 కూడా తమన్నాకి అలానే అవుతుంది అని, అనుష్క నట విశ్వరూపాన్ని పరిచయం చేసిన అరుంధతి సినిమాలానే తమన్నా కి ఓదెల2 పేరు తెచ్చిపెడుతుంది అని టీమ్ చెప్తూ వస్తోంది. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయిన ఓదెల మూవీ ఎలా ఉంది, తమన్నా లేడీ అఘోరాగా మెప్పించిందా లేదో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
టైటిల్ కి తగ్గట్టుగా ఓదెల గ్రామంలో జరిగిన కథ ఇది. ఆ ఊరిలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు అత్యాచారానికి గురై హత్య చేయబడతారు. వీరిని ఇలా చేస్తోంది తిరుపతి (వశిష్ఠ ఎన్ సింహ) అని తెలిసి అతని భార్య రాధ (హెబ్బా పటేల్) నరికి తానే చంపానని ఒప్పుకుని జైలుకు వెళ్తుంది. ఓదెల 2 కథ ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఆ ఊరి జనాలు తిరుపతి శవాన్ని కాల్చకుండా సమాధి కట్టి శిక్షించాలని, శవాన్ని నిలువుగా పూడ్చిపెట్టి ఆత్మ వెళ్లిపోకుండా, మోక్షం పొందకుండా బంధిస్తారు. దీంతో తిరుపతి ఆత్మ ఆ ఊరి వాళ్ళందరి మీద పగబడుతుంది. ఆరు నెలల తర్వాత ఊళ్లో పెళ్లిళ్లు జరగడం మొదలవుతాయి. తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి ఆ ఊరి ప్రజలపై పగ తీర్చుకోవాటానికి వస్తాడు. తిరుపతి వేరే వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశించి పెళ్లికూతుర్ని అత్యాచారం చేసి చంపేస్తుంది. మొదట వారిని వీరిని అనుమానించిన ఊరి ప్రజలు చివరికి తిరుపతి దుష్టశక్తిగా మారి ఓదెల ప్రజలపై పగ తీర్చుకుంటున్నాడని గ్రహిస్తారు. మరి తిరుపతిని ఊరి ప్రజలు ఎలా నిలువరించారు? తిరుపతి ప్రేతాత్మ ఓదెలలో ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంది? భైరవి (తమన్నా)ని ఎవరు ఓదెల రప్పించారు? భైరవి ఓదెలని ఎలా కాపాడుతుంది? ఓదెలతో భైరవికి ఉన్న సంబంధం ఏంటి? భైరవి కి తిరుపతి ప్రేతాత్మకు మధ్య పోరు ఎలా నడిచింది?అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ కాగా ఇప్పుడు వచ్చిన సెకండ్ పార్ట్ ఆత్మ, దేవుడు చుట్టూ కథ సాగుతుంది. ఓదెల కథ ముగిసిన దగ్గరే ఓదెల 2 స్టార్ట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు చూడగానే ఓ ప్రేతాత్మకు, పరమాత్మకూ మధ్య జరిగే యుద్ధమని ప్రేక్షకులు అంచనా వేశారు. సినిమా ప్రారంభంలోనే తిరుపతి ఆత్మ పెళ్ళికూతుర్ల జీవితాలను నాశనం చేస్తుంది. మొదట చాలా నార్మల్ గా అనిపించినా ఇదంతా ఆత్మ చేస్తుందని ఊళ్ళో వాళ్లకు తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. భైరవి ఎంట్రీతో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంటోంది. సెకండ్ హాఫ్ లో తిరుపతి చేసే వినాశనాన్ని చాలా బాగా ఎలివేట్ చేసారు. సెకండ్ హాఫ్ లో నెక్స్ట్ ఏంజరుగుతుందో అన్న కూతుహలం పెరుగుతుంది. ఎమోషనల్ గా సినిమా బాగానే ఉంది. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ తేల్చేసారు. సెకండ్ హాఫ్ పీక్స్ కి తీసుకెళ్లి క్లైమాక్స్ ఇలా తేల్చేయటం నిరుత్సాహంగా అనిపిస్తుంది. అమ్మోరు, అరుంధతి సినిమాలకి క్లైమాక్స్ ప్లస్. ఓదెల 2 లో ఇదే మైనస్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో డివోషనల్, హారర్ సినిమాలకి మంచి ఆదరణ ఉండటంతో ఓదెల2 మెప్పిస్తుంది. ఇందులో డివోషనల్ సెక్షన్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
దేవుడు, భయం నేపథ్యం లో ఓదెల 2 ప్రేక్షకుడ్ని మెప్పిస్తుంది. తిరుపతి ప్రేతాత్మతో భైరవి ఫేస్ టూ ఫేస్ సీన్స్ అదిరిపోయాయి. తమన్నా యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. దుష్టశక్తిని అంతం చేయటానికి స్వయంగా దేవుడే సపోర్ట్ చేయటం చాలా సినిమాల్లో చూసినా ఇది కొంచెం డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. శివతత్వాన్నిఇంకా కరెక్ట్ గా ఎలివేట్ చేసుంటే భారీ హిట్ అయ్యి ఉండేది. తమన్నాకి అని భాషల్లో ఉన్న క్రేజ్, మార్కెట్ కారణంగా సినిమా వసూళ్లు బాగానే ఉంటాయి. తమన్నా పాత్ర ప్రవేశం కూడా ఆకట్టుకుంది. ఆవుల్ని కాపాడే యాక్షన్ సీక్వెన్స్‌తో తమన్నా ఎంట్రీ అదిరింది. సెకండ్ హాఫ్ మొత్తం భైరవి Vs తిరుపతి ప్రేతాత్మ అన్నట్టు ఉంటుంది. కాకపోతే కొని చోట్ల ప్రేతాత్మని బలంగా చూపించారు. ఓ సాధారణ ప్రేతాత్మ ముందు శివశక్తి అయిన భైరవి ఓడిపోవటం, ఆత్మని ఎదిరించలేకపోవటం సగటు ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోలేడు. చివరిలో ట్విస్ట్ ఇచ్చి థర్డ్ పార్ట్ కూడా ఉందని హింట్ ఇచ్చాడు.
నటీ నటులు:
నాగసాధువుగా భైరవి పాత్రలో తమన్నా నటన, ఆహార్యం ఆకట్టుకుంది. తమన్నా భైరవి పాత్రకి హండ్రెడ్ పర్శంట్ న్యాయం చేసింది. కాకపోతే సెకండ్ హాఫ్ వరకు తమన్నా కనిపించక పోవడం కొంత మైనస్. క్లైమాక్స్ సీన్స్ లో తమన్నా అద్భుత నటన కనపరిచింది. తమన్నాకి అనుష్క అరుంధతి రేంజ్ గుర్తింపు రాకపోయినా క్రిటిక్స్ ప్రశంసలు లభిస్తాయి. తమన్నా కెరీర్ లో ఇది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఓదెల 2 తో తమన్నాకి ఇంకొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమా చాన్సులు వచ్చే అవకాశముంది. తమన్నా తరవాత చెప్పుకో దగిన పాత్రలో కనిపంచింది వశిష్ఠ. తిరుపతి పాత్రలో మరోసారి వశిష్ట అలరించాడు. స్క్రీన్ స్పెస్ తక్కువున్నా తన నటనతో, వాయిస్ తో కట్టిపడేసాడు. హెబ్బా పటేల్‌కు ఈ కథలో అంత ప్రాముఖ్యత లేదు. మురళీ శర్మ, నాగ మహేశ్, శరత్ లోహితాశ్వ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ :
వి.ఎఫ్.ఎక్స్, సీజీఐ, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ను అప్రిసియేట్ చేయాలి. వీరంతా సినిమా కి మంచి అవుట్ పుట్ ఇచ్చి సినిమా స్థాయిని పెంచారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సూపర్. హారర్ ఎపిసోడ్స్ చిత్రీకరణ బాగుంది. అజనీష్ లోక్ నాథ్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. తిరుపతి పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేయటంలో బీజియం హెల్ప్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్స్ ని మరింత ఎలివేట్ చేసాడు అజనీష్. పాటలు అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పార్ట్ 1 లాగే పార్ట్2 లో కూడా రియల్ లొకేషన్స్ లో తెరకెక్కించారు. క్లైమాక్స్ లో శివుడ్ని ఇంకా బాగా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
తమన్నా
వశిష్ట
టెక్నీకల్ టీమ్
సంగీతం
థ్రిల్లింగ్ మూమెంట్స్
మైనస్ పాయింట్స్
కథ , కథనం
క్లైమాక్స్
తమన్నా స్క్రీన్ స్పేస్
స్లో నేరేషన్
ఫైనల్ వర్దిక్ట్: లాజికల్ గా మ్యాజిక్ చేయలేని 'ఓదెల 2'