ఇప్పటివరకు తన గ్లామర్ తో, డాన్స్ తో అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఉమెన్స్ డే రోజు ఒక కొత్త గెటప్ లో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. 'శ్రీ' సినిమాతో టాలీవుడ్ లో కెరియర్ మొదలుపెట్టి, హ్యాపీడేస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ సింధీ బ్యూటీ. తెలుగు , తమిళం, మలయాళం , హిందీ సినిమాల్లో పలువురు స్టార్స్ తో నటించి స్టార్ డమ్ అందుకుంది. మొన్న మొన్నటి వరకు యంగ్ స్టార్స్ తో నటించిన తమన్నా ఇప్పుడిప్పుడే సీనియర్ హీరోలకి బెస్ట్ ఛాయిస్ గా మారింది. అన్ని భాషల సినిమాల్లో నటిస్తూనే, OTT ప్లాట్ ఫామ్ లకి కూడా ఓకే చెప్తూ కొన్ని వెబ్ సిరీస్ ల్లో నటించింది. లేడీ ఓరియంటెడ్ కథలకు కూడా సైన్ చేస్తోంది. ఈక్రమంలోనే ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్ కి ఓకే చెప్పింది తమన్నా.
2022లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' కి సంపత్ నంది కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రజంట్ సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుండటంతో ఈ మూవీకి కూడా సీక్వెల్ ప్లాన్ చేశారు. ఈ మూవీ లీడ్ రోల్ కోసం తమన్నాని ఫిక్స్ చేశారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, శివరాత్రి సందర్భంగా తమన్నా లుక్ ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు కనిపించని లేడీ అఘోర పాత్రలో తమన్నా లుక్ ని షేర్ చేసారు మేకర్స్. కాషాయ దుస్తుల్లో ఉన్న తమ్ము చేతిలో ఢమరుకం, నుదుటిన విబూదితో ‘శివశక్తి’ రూపంలో దర్శనమిస్తోంది. తమన్నా ఈ లుక్ లో కూడా మెస్మరైజింగ్ గా ఉంది.
ఈ చిత్రానికి కూడా సంపత్ నంది కథని అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. మొదటి పార్ట్ OTT లో రిలీజ్ చేసినా సెకండ్ పార్ట్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.