'నోటా' సినిమాకి ముందు విజయ్ దేవరకొండ చాలామందికి నచ్చలేదు. అది అతని ఆటిట్యూడ్ సమస్య. అదే తనకు బలం అని విజయ్ దేవరకొండ అనుకున్నాడుగానీ, అది తేడా కొట్టింది. 'నోటా' రిజల్ట్ తర్వాత వాస్తవం తెలుసుకున్నట్టున్నాడు. ఆటిట్యూడ్ పూర్తిగా మార్చుకున్నాడు. దాంతో, అందరూ విజయ్ దేవరకొండని అభిమానిస్తున్నారిప్పుడు. అనూహ్యంగా విజయ్ దేవరకొండపై సింపతీ పెరిగిపోయింది. కారణం 'ట్యాక్సీవాలా' సినిమా విడుదలకు ముందే లీక్ అవడం.
టాలీవుడ్‌లో పలువురు యంగ్ హీరోలు, 'ట్యాక్సీవాలా'ని కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్, విజయ్‌కి సపోర్ట్‌గా నిలిచాడు. తాజాగా వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కూడా 'ట్యాక్సీవాలా' సినిమా కోసం ఆ సినిమా టీమ్ పడ్డ కష్టం గురించి పేర్కొంటూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో క్రమక్రమంగా 'ట్యాక్సీవాలా' సినిమాకి సపోర్ట్ పెరుగుతోంది. అగ్రహీరోల అభిమానులు, యంగ్ హీరోల అభిమానులు కూడా 'ట్యాక్సీవాలా' సక్సెస్ అవ్వాలని కోరుకుంటుండడం గమనించాల్సిన విషయం.
పైరసీని ఎవరూ ఎంకరేజ్ చేయొద్దని సినీ ప్రముఖులు ఇస్తున్న పిలుపు ఆహ్వానించదగ్గదే. అయితే ఈ సమయంలో సినీ పరిశ్రమని ఉద్దేశించి కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు నెటిజన్లు. ఏ సినిమా విషయంలో అయినా అందరు హీరోలూ ఇలాగే స్పందించి, పైరసీకి వ్యతిరేకంగా గళం విప్పాలనీ, తద్వారా సినిమా పరిశ్రమ పైరసీ నుంచి బయటపడుతుందని వారు సూచిస్తున్నారు. ఒక్క సినిమా విషయంలోనే ఇలా హడావిడి చేసి ఆ తర్వాత లైట్ తీసుకోవడం వల్ల ప్రయోజనమేంటి?