అహింస - అనే ఆయుధంతోనే బ్రిటీష్ వారిని తరిమికొట్టారు గాంధీజీ. ఆయన పాటించిన సహనం, శాంతి... ప్రపంచానికి మార్గదర్శకాలయ్యాయి. ఇప్పుడు ఇదే ఆయుధంతో బాక్సాఫీసుని కొల్లగొట్టడానికి వస్తున్నాడు తేజ. దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ, తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి `అహింస` అనే పేరు పెట్టారు. ఆర్పీ పట్నాయక్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రేమకథా చిత్రాల్ని తేజ బాగా తీస్తాడని పేరు. అభిరామ్ కోసం కూడా అలాంటి కథే తయారు చేశాడనుకున్నారు. అయితే ఈసారి తేజ యాక్షన్ పంథాలో సాగబోతున్నాడని తెలిసింది. అహింస అనే టైటిల్ పెట్టుకున్నా - ఈ చిత్రంలో యాక్షన్ కి కొదవ లేదని సమాచారం.
తేజ దర్శకత్వంలో `చిత్రం 1.1` తెరకెక్కాల్సివుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే అభిరామ్ కోసం ఆ ప్రాజెక్టు పక్కన పెట్టాడు తేజ. `అహింస` తరవాతే.. చిత్రం సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్తుంది. అహింసలో కథానాయిక పాత్ర కోసం కృతి శెట్టిని సంప్రదించింది చిత్రబృందం. అమె నో చెప్పడంతో ఈ సినిమాకి హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు తేజ.