చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న సినిమాకైనా భారీ ఎత్తున ప్రచారం చేయాలి. తప్పదు. చిన్న సినిమాలకు కావల్సిందే ప్రచారం. ఈమధ్య ఓ చిన్న సినిమా భీకరమైన ప్రచారం చేయించుకుంది. స్టార్సంతా పనిగట్టుకుని ప్రచారం చేశారు. కానీ.. ఆ సినిమా వసూళ్లు మాత్రం దారుణాతి దారుణంగా తయారయ్యాయి. ఆ సినిమానే `తెల్లవారితే గురువారం`.
కీరవాణి తనయుడు సింహా కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. మరో తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. కీరవాణి తనయుల సినిమా అంటే.. రాజమౌళి ఏ రేంజులో ప్రచారం చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రాజమౌళి, ఎన్టీఆర్‌లు వచ్చి ఆశీర్వదించారు. కేవలం ప్రచారానికే కోటి రూపాయల వరకూ ఖర్చు పెట్టినట్టు టాక్. సినిమాకి 3 కోట్ల వరకూ బిజినెస్ అయ్యింది కూడా. తీరా చూస్తే.. శనివారం విడుదలైన ఈ సినిమా థియేటర్లో జనాలే లేరు. కనీసం 20 శాతం టికెట్లు కూడా తెగకపోవడం నిరాశ కలిగిస్తోంది. మల్టీప్లెక్స్ సినిమా అంటూ ప్రచారం జరిగినా.... మల్టీప్లెక్సులలోనూ జనాలు లేరు. పబ్లిసిటీ ఎంత పీక్స్‌లో ఉన్నా -కంటెంట్ వీక్ అయితే పరిస్థితి ఇలానే ఉంటుంది మరి.