నటీనటులు : శ్రీ సింహా, మిషా నరాంగ్, చిత్ర శుక్లా, సత్య, తదితరులు
దర్శకత్వం : మణికాంత్ జెల్లి
నిర్మాతలు : రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు
ఎడిటింగ్ : సత్య గిడుతూరి
రేటింగ్: 2.5/5
కొన్ని ఐడియాలు బాగుంటాయి. కానీ... సినిమాగా తీయాల్సిన దమ్ము అందులో ఉండదు. చిన్న పాయింట్ తో సినిమాని తీయడానికి తెలివితేటలు ఎక్కువ కావాలి. అనుభవం మేరకే అదొస్తుంది. కొంతమంది యువ దర్శకులు, ప్రతిభావంతులు.. చిన్న చిన్న పాయింట్లతో భలేటి సినిమాలు తీసేస్తుంటారు. `తెల్లవారితే గురువారం`లోనూ ఓ ఆసక్తికకమైన పాయింట్ ఉంది. పెళ్లి కొడుకు - పెళ్లి కూతురు.. పెళ్లి మండపం నుంచి జాయింటుగా పారిపోవడం ఆ పాయింట్ లోని గమ్మత్తు. అయితే రెండు గంటల పాటు వినోదం పండించడానికి ఈ పాయింట్ సరిపోయిందా, లేదా? `మత్తువదలరా` తో ఆకట్టుకున్న సింహా.. ద్వితీయ వీఘ్నం దాటగలిగాడా?
* కథ
వీరు (సింహా), మధు (మిషా నారంగ్)ల పెళ్లి కుదురుతుంది. తెల్లవారితే... పెళ్లి. అయితే ఈ పెళ్లి అటు వీరుకీ, ఇటు మధుకీ ఇద్దరికీ ఇష్టం ఉండదు. ప్రేమించిన అమ్మాయి కృష్ణవేణి (చిత్ర శుక్లా) ని కలుసుకోవడానికి పెళ్లి మండపం నుంచి పారిపోతాడు వీరు. తనతో పాటు.. మధు కూడా వచ్చేస్తుంది. అయితే మధు ఎందుకు పారిపోవాలనుకుంది? వీరు - చిత్రలు కలిశారా? ఈ ప్రయాణంలో వీరు గురించి మధుకీ, మధు గురించీ వీరూకి ఏం తెలిశాయి? వాళ్ల మనసులు ఎలా కలిశాయి? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
పెళ్లిమండపం నుంచి పెళ్లి కొడుకు - పెళ్లి కూతురు పారిపోవడం ఈ కథలోని పాయింట్. సూర్యదేవర రామ్మోహనరావు `పెళ్లి కొడుకు లేచిపోయాడు` దగ్గర్నుంచి ఈ తరహా పాయింట్లు చూస్తూనే ఉన్నాయి. కొత్త అంశం ఏమీ కాదు గానీ, కొత్తగా చెప్పడానికి కొత్తగా నవ్వించడానికీ చాలా స్కోప్ ఉంది. ఈ విషయంలో దర్శకుడు కొంత మేర సక్సెస్ అయ్యాడు కూడా.
పెళ్లిలో... వైవా హర్ష లాంటి పాత్రని పెట్టి, తన నుంచి కావల్సినంత కామెడీ లాగేశాడు. కొన్ని సన్నివేశాలు బాగా నవ్విస్తాయి కూడా. అయితే... క్రమంగా పట్టు తప్పేసింది. చిన్న పాయింట్ ని 2 గంటల పాటు నడపడం మాటలు కాదు. బలమైన కథ లేకపోయినా, కదిలించే సన్నివేశాలు, బలమైన పాత్రలూ ఉండాలి. అవి.. `తెల్లవారితే గురువారం`లో కరువయ్యాయి. కథనం చాలా నెమ్మదిగా సాగింది. ప్రేక్షకుల్ని విసిగిస్తుంది కూడా. వీరు - చిత్ర లవ్ స్టోరీలోనూ బలం లేకుండా పోయింది.
ఎంత సాగినా.. ఎంత లాగినా.. ఒకే ఒక్క పాయింట్ చుట్టూ కథ తిప్పడం వల్ల బోర్ కొట్టేస్తుంది. అందుకే.. అజయ్ లాంటి పర్సనాలిటీని తీసుకొచ్చి విలనిజం చూపించారు. అజయ్ రాక వల్ల సినిమాకి ఒరిగిందేం లేదు. పైగా అప్పటి వరకూ ఉన్న ఫీల్ మొత్తాన్ని ఎగరేసుకుపోయాయి. ద్వితీయార్థాన్ని ఇంకా ట్రిమ్ చేయాల్సింది. లేదంటే.. కొత్త తరహా ట్రాకులను రాసుకోవాల్సింది. ఇవి రెండూ చేయలేకపోయాడు దర్శకుడు. పైగా.. ఊహాజనితమైన సన్నివేశాలు ఒకదాని తరవాత మరోటి వస్తూ పోతూ ఉంటాయి. థియేటర్ గోడల వైపు, ఎగ్జిట్ తలుపుల వైపు చూడడం తప్ప.. ప్రేక్షకుడు ఏం చేయలేకపోయాడు. తొలి సగంలో ఉన్న కామెడీ కూడా ద్వితీయార్థంలో వర్కవుట్ కాకపోవడంతో.. తెల్లవారితే గురువారం ఎంటర్ టైన్ చేయలేకపోయింది.
* నటీనటులు
సింహాకి ఇది రెండో సినిమా. తొలి సినిమాతో పోలిస్తే... కొంచెం మెరుగైనట్టే. తన ఫేసులో అమాయకత్వం బాగా పండింది. హీరోయిన్లదిద్దరూ పాస్ అయిపోయినట్టే. ఇద్దరూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ పలికించారు. కాకపోతే ఆయా పాత్రల్ని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. హర్ష బాగా నవ్వించాడు. ఈ సినిమాకి తనే ప్రధాన బలం. సత్య కూడా అలవాటు ప్రకారం నవ్వించాడు. అజయ్ పాత్ర వేస్ట్ కార్డులా మారింది.
* సాంకేతిక వర్గం
`ఈగ` లాంటి సినిమా తీసిన వారాహి నుంచి వచ్చిన సినిమా ఇది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కాలభైరవ పాటలు మరీ గుర్తించుకునే స్థాయిలో లేవు గానీ, ఫర్వాలేదనిపించాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పాయింట్ బాగున్నా - కథనం పేలవంగా ఉండడంతో... రక్తి కట్టలేకపోయింది. ఎడిటర్ కాస్త స్వేచ్ఛ తీసుకుని ఉంటే... నిడివి తగ్గి సినిమాలో ఇంకొంచెం వేగం వచ్చేది.
* ప్లస్ పాయింట్స్
కథలో పాయింట్
నటీనటులు
నేపథ్య సంగీతం
* మైనస్ పాయింట్స్
కథనం
ద్వితీయార్తం
* ఫైనల్ వర్డిక్ట్: తెల్లారిపోయింది