తేజ - వెంకీ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా 'చిరుత' క్లైమాక్స్‌లో చరణ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ 'ఆటా నాదే - వేటా నాదే'ని ఈ సినిమాకి టైటిల్‌గా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా వెంకటేష్, తేజ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఇది. 'గురు' వంటి భిన్నమైన చిత్రంలో నటించిన వెంకటేష్‌కి, తన మార్కు ఇమేజ్‌కి తగ్గట్లుగా ఈ సినిమా ఉండబోతోందనీ తెలుస్తోంది. అంటే ఎంటర్టైన్మెంట్కి ఈ సినిమాలో ఎక్కువ స్కోప్ ఇవ్వనున్నారట. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా అందాల శ్రియని ఎంచుకున్న సంగతి తెలిసిందే. శ్రియ, వెంకటేష్ కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది.
గతంలో 'సుభాష్ చంద్రబోస్', 'గోపాల గోపాల' చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కాయి. కాగా ఈ సినిమాలో యంగ్ హీరో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్‌తో పాటు మరో బ్యూటీ తాజాగా ఈ సినిమా కోసం ఎంపికైనట్లు సమాచారమ్. ఆమె ఇంకెవరో కాదు, ఈషా రెబ్బ. అచ్చమైన తెలుగమ్మాయి. ఇటీవలే 'అ' సినిమాలో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం ఈ ముద్దుగుమ్మని ఎంచుకున్నారనీ తెలియవస్తోంది. కొత్త వాళ్లతో చిత్రాలను తెరకెక్కించే తేజ, ఇప్పుడు ట్రేక్ మార్చాడు. సీనియర్ హీరోస్‌కి గాలమేస్తున్నాడు.
ఇప్పుడు వెంకీతో సినిమా చేస్తున్నాడు. తర్వాత బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ చేయనున్నాడు. కొత్త ఆర్టిస్టులతో ఫ్రెష్ మూవీస్‌ని తెరకెక్కించే తేజకి సక్సెస్ ఈ మధ్య బొత్తిగా ముఖం చాటేసింది. దాంతో రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాని తెరకెక్కించి ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత నుండే తేజ తన కొత్త ఆలోచనకు పదును పెట్టాడు. అందులో భాగంగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తర్వాత తేజ నుండి వస్తోన్న రెండో ప్రయత్నం వెంకీ సినిమానే. చూడాలి మరి తేజ ఈ సినిమాతో మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో!