తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు. రాజబాబు ను అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి.తన చుట్టూ వున్న వారిని హాయిగా నవ్విస్తూ వుండే రాజ బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతి కలిగించింది.
రాజబాబు , తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేట లో 13 జూన్ 1957లో జన్మించారు. ఆయన తండ్రి పేరు రామతారకం. ఆయన చిత్ర నిర్మాత నటుడు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో "స్వర్గం -నరకం ", "రాధమ్మ పెళ్లి " సినిమాలను నిర్మించారు. కాకినాడలో స్థిరపడిన రాజబాబు కు వ్యవసాయం చెయ్యడమన్నా , కబడే ఆడటమన్నా , రంగస్థల మీద నటించడమన్నా ఎంతో ఇష్టం.
చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాజబాబును. 1995లో “ఊరికి మొనగాడు ” అన్న సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తరువాత సిందూరం సినిమా తరువాత రాజబాబును అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
కాకినాడ నుంచి రాజబాబు హైదరాబాద్ కు మకాం మార్చి సినిమా రంగంపై దృష్టి పెట్టారు.ఆనతి కాలంలోనే రాజబాబు , సముద్రం ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే , మురారి ,శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,సముద్రం , కళ్యాణ వైభోగం ,మళ్ళీ రావా ?, శ్రీకారం , బ్రమ్మోత్సవం , భరత్ అనే మొదలైన 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.
సినిమాతో పాటు టీవీ రంగంలో కూడా రాజబాబు నటించారు.. వసంత కోకిల, అభిషేకం , రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం , చి ల సౌ స్రవంతి ,ప్రియాంక సీరియల్స్ లో పోషించిన పాత్రలు రాజబాబు కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. రాజబాబు 48 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరికీ ఆత్మీయుడయ్యారు.
2005వ సంవత్సరంలో "అమ్మ " సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. రాజబాబును కాకినాడలో ఘనంగా సత్కరించారు.
రాజబాబు కు పుట్టి పెరిగిన వూరు అంటే ఎంతో ఇష్టం , సంక్రాంతికి కాకినాడ వెళ్లి మిత్రులతో సరదాగా గడుపుతూ , కోడి పందాలలో పాల్గొనేవాడు.
సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ రాజబాబుకు ఎంతో మంది స్నేహితులు , ఆత్మీయులు వున్నారు. తెలుగు తనాన్ని తెరమీద పంచి తెర మెరుగైన రాజబాబు ఎప్పటికీ తన పాత్రల ద్వారా చిరంజీవిగా వుంటారు