నాగ చైతన్య, సమంత విడాకుల పై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సమంతకు మరియు అక్కినేని కుటుంబానికి అండగా టాలీవుడ్ నిలిచింది. అందరు స్టార్ హీరోలు, ఇతర సెలెబ్రిటీలు X మాధ్యమం ద్వారా స్పందిస్తూ మద్దతు ఇస్తున్నారు.
అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కూడా ఈ వివాదం పై స్పందించారు.
"తెలంగాణకు చెందిన ఒక గౌరవనీయ మహిళా మంత్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చేసిన అభ్యంతరకరమైన, ధృవీకరించబడని మరియు వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల బాధ మరియు ఆవేదనను వ్యక్తం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, తెలుగు సినీ సెలబ్రిటీలు మరియు ఇతర తెలుగు ఫిల్మ్ ఫ్రాటర్నిటీ సభ్యులు చాలా మందికి సులువైన టార్గెట్ గా మారారు. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తులపై చేసిన దుర్మార్గమైన మరియు హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని తెలియజేయుచున్నాము.
రాజకీయాలు మరియు చలనచిత్ర పరిశ్రమ సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ రంగాలు పరస్పర సహకారం మరియు గౌరవం అందిపుచ్చుకుంటూ సమాజంలో తమ బాధ్యతను గుర్తెరిగి ఉండడం చాలా కీలకం. రాజకీయ నాయకులు అపారమైన అధికారాన్ని కలిగి ఉంటారు మరియు సినిమాలు సాంస్కృతిక కథనాలను రూపొందిస్తాయన్నది వాస్తవం. ఈ రకమైన సంఘటనలు సమాజంలోని ప్రముఖ వ్యక్తులు మరియు వారు వుండే ప్రపంచం యొక్క వ్యత్యాసాన్ని తెలియజేస్తూ హైలైట్ అవుతాయి. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని ప్రభావవంతమైన వ్యక్తులు మరియు అధికారంలో ఉన్న వ్యక్తులు దుర్వినియోగం చేయకూడదాని పేర్కొనుచున్నాము.
అనేక సంవత్సరాల నుండి గమనించింది ఏమనగా, వేరే ఏదైనా సమస్యను దృష్టిని మరల్చడం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోని వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది.
సంస్కృతిని ప్రభావితం చేయడంలో మరియు సాధారణ ప్రజల దృక్కోణాలను రూపొందించడంలో ఫిల్మ్ ఫ్రాటర్నిటీ సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలు జీవితాలను ప్రభావితం చేసే విధానాలను రూపొందిస్తాయి. రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి మరియు సినిమాలు సమాజంలో సామాజిక భాద్యతను తెలియజేసేలా ప్రతిబింబిస్తాయి. ఈ రెండు ప్రపంచాల మధ్య వ్యత్యాసాన్ని అందరూ అభినందిద్దాం మరియు ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు సమాజం యొక్క అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్దాం.
ఇలాంటి హేయమైన చర్యలను మానుకోవాలని, అందరినీ కోరుతున్నాము. మా మీడియా మిత్రులను (ప్రింట్, సోషల్, ఎలక్ట్రానిక్స్ మరియు డిజిటల్) నైతిక మరియు వివేకవంతమైన సూత్రాలు మరియు విలువలను పాటించవలసిందిగా కోరుతున్నాము.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ జాతి/లింగ/మత వివక్ష లేకుండా లౌకిక సంస్థగా ఎల్లప్పుడూ ముందంజలో ఉండి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను తెచ్చిపెట్టింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఇప్పుడు మరియు భవిష్యత్తులో తమ సభ్యులకు అండగా నిలుస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి సున్నితమైన విషయాలపై ఎవరైనా ఈ విధంగా మాట్లాడిన యెడల అలాంటి వారిపై బలమైన తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడరాని మరొకసారి తెలియజేస్తున్నాము" అని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది.