మన హీరోలు.. తెరపైనే హీరోలు. బయట జీరోలు. ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది. ఇప్పుడు చెన్నై హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు హీరో విజయ్ ని ఉద్దేశించి చేయడం.. ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళ హీరో విజయ్ ఈమధ్య విదేశాల నుంచి ఓ ఖరీదైన కారుని దిగుమతి చేసుకున్నాడు. విదేశాల నుంచి ఇలాంటి కార్లు దిగుమతి చేస్తే... దానికి భారీ ఎత్తున సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అదీ లక్షల్లో. విజయ్ కూడా పన్ను చెల్లించాల్సివచ్చింది.అయితే తనకు ఈ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కావాలని.. చెన్నై కోర్టుని సంప్రదించాడు విజయ్. ఈ పిటీషన్ పై చెన్నై కోర్టు తీర్పు కూడా వెలువడించింది. పన్ను ఎగ్గొట్టేందుకు కారణాలు వెదకొద్దని, ప్రజలు హీరోల్ని దేవుడులా కొలుస్తారని, వాళ్ల ముందు జీరోలు కావొద్దని.. సూచించింది. పన్ను చెల్లించాల్సిందిగా విజయ్ ని ఆదేశించింది. అంతే కాదు.. లక్ష రూపాయలు జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు.. హీరోలందరికీ చెంప పెట్టులాంటిది. కోట్లలో పారితోషికాలు తీసుకుంటూ, విలాసవంతమైన జీవితం గడుపుతూ.. పన్ను కట్టాల్సివచ్చినప్పుడు మాత్రం... మినహాయింపు కావాలని అడగడం.. నిజంగా.. విచిత్రమే. ఇది వాళ్ల పీసానితనానికి నిదర్శనమని... సినీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.