శ‌భాష్ త‌మ‌న్‌.. మ‌న‌సుల్ని గెలిచేశావ్!

మరిన్ని వార్తలు

ప్రార్థించే పెద‌వులు చాలామందికి ఉంటాయి. కానీ సాయం చేయ‌డానికి చేతులే రావు. మైకు ప‌ట్టుకుంటే నీతి వాక్యాలు చెప్పేవాళ్లంతా, ఒక‌రికి అవ‌స‌రం అనుకున్న‌ప్పుడు ప‌లాయ‌నం చిత్తగిస్తుంటారు. అయితే కొంత‌మంది ద‌యాహృద‌యులు కూడా ఉంటారు. భావోద్వేగాలు అస్స‌లు కంట్రోల్ చేసుకోలేరు. సాయం కావాలి అనుకున్న‌ప్పుడు చ‌టుక్కున స్పందిస్తారు. అడ‌క్కుండానే వ‌రాలు ఇచ్చేస్తుంటారు. త‌మ‌న్ నీ ఈ లిస్టులో చేర్చేయొచ్చు.


తాజాగా... త‌మ‌న్ ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ క‌ట్టాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాడు. అందుకు కార‌ణం.. ఓ వైర‌ల్ వీడియో. త‌మిళ‌నాట ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. అందులో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ఓ వృద్దురాలికి ఆహారం అందించాడు ఓ నెటిజ‌న్‌. అప్పుడు ఆమె చూపిన కృత‌జ్ఞ‌త‌కు... ఎవ‌రి హృద‌యాలైనా త‌ల్ల‌డిల్లాల్సిందే. ఈ వీడియో త‌మ‌న్ వ‌ర‌కూ చేరింది.


‘ఈ వీడియో చూసి నా గుండె ప‌గిలింది. ఓల్డ్ ఏజ్ హోమ్ క‌ట్టాల‌న్న కొత్త ఆశ‌యం నా మ‌న‌సులో నాటుకుంది. నా కోరికను త్వరలోనే నిజం చేస్తాను. దానికి తగిన ధైర్యాన్ని, బ‌లాన్ని దేవుడు నాకు అందిస్తాడని ఆశిస్తున్నాను. కన్నీళ్లతో ఈ మెస్సేజ్‌ పెడుతున్నాను. మీరు కూడా దయచేసి ఆహారాన్ని వృథా చేయకండి. అవసరమైన వారికి దానిని అందించండి’ అని త‌మ‌న్ కోరాడు. ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో త‌మ‌న్ ఒక‌డు. ఇప్పుడు.. త‌న మాన‌వ‌తాదృక్ప‌థాన్ని ఇలా చాటుకున్నాడు. త‌మ‌న్ స్పంద‌న చూసిన వాళ్లంతా `శ‌భాష్ త‌మ‌న్‌.. మ‌న‌సుల్ని గెలిచావ్` అంటూ పొగిడేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS