తండేల్ మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: తండేల్ 
దర్శకత్వం: చందు మొండేటి 
కథ - రచన: చందు మొండేటి 


నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, దివ్య పిళ్లై, కరుణాకరన్, బబ్లూ పృథ్విరాజ్, కల్పలత తదితరులు.  


నిర్మాతలు: బన్నీ వాసు, అల్లు అరవింద్ 


సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్
ఎడిటర్: నవీన్ నూలి 


బ్యానర్: గీతా ఆర్ట్స్ 
విడుదల తేదీ: 7 ఫిబ్రవరి 2025 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

 

నాగ చైతన్య చాలా కాలంగా హిట్ కోసం పరితపిస్తూ, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. చైతు కెరియర్ కి అర్జంట్ గా ఒక  హిట్ అవసరం. తండేల్ పై చైతు భారీ ఆశలు పెట్టుకున్నాడు. తండేల్ తన ఆశను నెరవేరుస్తుంది అని ధీమాగా ఉన్నాడు. అందుకే  ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్స్ చేసాడు చైతు. పైగా చైతు మొదటి పాన్ ఇండియా సినిమా 'తండేల్'. ఈ మూవీలో  సాయి పల్లవి నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయి పల్లవి తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటే తప్ప, స్టార్ హీరో అయినా సినిమా ఒప్పుకోదు.  అలాంటిది సాయి పల్లవి నటిస్తుండటం, ఇది వరకు చైతు, సాయి పల్లవి నటించిన  'లవ్ స్టోరీ' సినిమా సూపర్ హిట్ అవటంతో  రెండో సారి వీరిద్దరి కాంబోలో వస్తున్న 'తండేల్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈవారం థియేటర్స్ లో తండేల్ రిలీజ్ అయ్యింది. చైతూకి తండేల్ కలిసి వచ్చిందా లేదా? చైతు మొదటి పాన్ ఇండియా హిట్ కొట్టాడా లేదా? అన్నది ఈ రివ్యూలో చూద్దాం.     


కథ :
శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఒక ఊరిలో ఉంటాడు రాజు(నాగచైతన్య). అదే ఊరిలో ఉండే  సత్య (సాయి పల్లవి)తో రాజు ప్రేమలో పడతాడు. వీరిద్దరూ ఒకర్ని ఒకరు ఘాడంగా ప్రేమించుకుంటారు. మత్సకారుడైన రాజు ఊరిలో వారితో కలిసి గుజరాత్ వెళ్లి చేపల పడుతుంటాడు. ఆ గ్రూప్ మొత్తానికి రాజు తండేల్ (లీడర్). ఒక యేడాదిలో  తొమ్మిది నెలలు సముద్రం మీద చేపలు పట్టే రాజు, మిగతా మూడు నెలలు తాను ప్రేమించిన సత్యతో  టైం స్పెండ్ చేస్తాడు. అయితే ఒకసారి అలా వేటకి వెళ్లిన ఒకరు చనిపోవటంతో సత్య భయంతో రాజుని ఇక వేటకి వెళ్లోద్దని ఏడుస్తుంది. కానీ రాజు సత్య మాటని లెక్కచేయకుండా వేటకు గుజరాత్ వెళ్తాడు. ఇలా శ్రీకాకుళం నుంచి చేపల వేటకి   గుజరాత్ సముద్ర జలాల్లోకి వెళ్లిన  22 మంది మత్సకారులు తుఫానులో చిక్కుకుంటారు. పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక జాలారిని రక్షించే ఆలోచనతో ఆ దేశ జలాల్లోకి వెళతారు. అలా వెళ్లిన జాలర్లుని కోస్టు గార్డులు అరెస్ట్ చేసి కరాచీలో సింధ్ జైలుకు పంపిస్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది? వాళ్ళను తిరిగి భారత దేశానికి తీసుకు వచ్చే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు? పాకిస్థాన్ లో చిక్కుకున్న జాలర్లను ఎవరు ఇండియాకి తీసుకువచ్చారు? ఊరిలో మత్సకారుల కష్టాలు తీర్చేందుకు సత్య తీసుకున్న నిర్ణయం ఏంటి ? సత్య ఇంకో వ్యక్తితో పెళ్ళికి ఎందుకు సిద్ధం అయ్యింది? చివరకు రాజు సత్య కలుసుకున్నారా? పెళ్లి చేసుకున్నారా? కథ సుఖాంతం అయ్యిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసు కోవాల్సిందే.  


విశ్లేషణ: 
ఇది నిజంగా జరిగిన కథ అని అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం మత్స్యకారులు కొందరు తప్పిపోయి పాకిస్థాన్ కి వెళ్ళిపోవటం, అక్కడి వారిని అరెస్ట్ చేయటం, తరవాత చాలా ప్రయత్నాలు చేయగా వారు ఇండియాకి తిరిగి వచ్చారు. ఇదే కథని చందు మొండేటి ప్రేమ కథగా తెరకెక్కించారు. ఇది అందరికి తెలిసిన కథ అయినా, స్క్రీన్ ప్లేతో కొత్తగా చెప్పొచ్చు, ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగేలా రాసుకోవచ్చు. కానీ దర్శకుడు ఈ విషయంలో తడబడ్డాడు. ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. లవ్ స్టోరీ మీదే ఎక్కువ కాన్సన్  ట్రేషన్ పెట్టారు అనిపిస్తుంది. సినిమాకి ప్రధాన బలం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. 


'తండేల్' లో చాలా జోనర్లు టచ్ చేసాడు దర్శకుడు. లవ్ స్టోరీ, దేశభక్తి, ఎమోషన్స్, అన్ని మిక్స్ చేసి ఉంటాయి. ఇలా ఒకే సినిమలో అన్ని జోనర్లు చూపించాలనే తాపత్రయంలో దేనికి పూర్తి టైం ఇవ్వలేకపోయారు. టీమ్ ప్రమోషన్స్ లో లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది అని చెప్పారు. ఆ కొత్తదనానికి కారణం దేవి శ్రీ సంగీతం అని చెప్పటం ఏమాత్రం అతిశయం అనిపించదు. చైతు,సాయి పల్లవి జోడీ చూడ ముచ్చటగా ఉంది. వీరిద్దరి మధ్య  కెమిస్ట్రీ సూపరని చెప్పాలి. పాటలు సినిమాలో ఇంకా బాగున్నాయి. చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ ఆహా అనిపిస్తుంది. పాటల్లో కేవలం డ్యాన్స్ మాత్రమే చూపించకుండా మాంటేజ్ సీన్స్ కూడా చూపిస్తూ  ప్రేక్షకులకి కొత్త అనుభూతిని కల్పించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ, చేపల వేట, చూపించి, సెకండ్ హాఫ్ లో  పాకిస్తాన్ జైలుకు కథ షిఫ్ట్ చేసారు. పాకిస్తాన్ జైల్లో ఉన్న జాలర్లను ఇండియాకి తీసుకురావటానికి చేసిన ప్రయత్నాలు సినిమాటిక్ గా ఉంటాయి. పాకిస్తాన్ జైలులో జరిగిన సీన్స్ లో దేశభక్తి ఫీలింగ్ కలగదు.  


నటీ నటులు:
నాగచైతన్య నిజంగా ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తోంది. తండేల్ గూర్చి మాట్లాడినప్పుడు చైతు  చెప్పిన మాటలు నిజాలు అనిపించక మానవు. నిజాయితీగా కష్టపడ్డాడు. రాజు పాత్రలో ఒదిగిపోయిన తీరు,  శ్రీకాకుళం యాశ, వేషం, అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా చేసిన కృషి అడుగడుగునా కనిపిస్తోంది. రాజు పాత్రలో చైతు పరకాయ ప్రవేశం చేసాడు. బాడీ లాంగ్వేజ్ కూడా విభిన్నంగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఎమోషన్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. ఏదైనా చైతు కెరియర్ లో బెస్ట్ మూవీ గా నిలిచి పోతుంది 'తండేల్'. సాయిపల్లవి నటన గూర్చి కొత్తగా మాట్లాడుకోవటానికి ఏముంది . సాయి పల్లవికి ఏ పాత్ర ఇచ్చినా చక్కగా అందులో ఒదిగిపోతుంది. ఆ పాత్రలో ఆమెని తప్ప ఇంకెవర్నీ ఊహించలేనంతగా ఉంటుంది సాయి పల్లవి నటన. మొదటి నుంచి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. సాయి పల్లవి మలయాళీ అమ్మాయి అయినా తెలుగులో చేసిన  ఫిదా సినిమాకోసం తెలంగాణా మాండలికం నేర్చుకుంది. ఇప్పుడు తండేల్ కోసం శ్రీకాకుళం మాండలికం నేర్చుకుని తానే స్వయంగా డబ్బింగ్ చెప్పింది. మిగతా పాత్రల్లో నటించిన దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, కల్పలత తమ పాత్రల పరిధి మేరకు నటించారు. తమిళ యాక్టర్ కరుణాకరన్ పాత్రలో తెలుగు యాక్టర్ ఉండి ఉంటే బాగుండేది.  


టెక్నికల్ :
కొన్ని కథలు రాసుకున్నప్పుడు బాగుంటాయి. మంచి ఎక్జయింటింగ్ గా అనిపిస్తుంది. కానీ దానిని స్క్రీన్ పై ప్రజెంట్ చేసేటప్పుడు సరైన స్క్రీన్ ప్లే లేకపోతె ఆ ఫీల్ పోతుంది. తండేల్ సినిమాలో ఈ లోపం కనిపిస్తుంది. సెట్స్ అన్నీ న్యాచురల్ గా ఉన్నాయ్, ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది, టాలెంటెడ్ నటీ నటులు అయినా ఎదో వెలితి కనిపించింది. కారణం చందు రాసుకున్న స్క్రీన్ ప్లే ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు. కొన్ని కొన్ని సీన్స్  చందు మొండేటి అద్భుతంగా  కంపోజ్ చేసాడు. చందు కథకుడిగా కంటే దర్శకుడిగా మార్కులు కొట్టేసాడు. దర్శకుడిగా ఫుల్ ఎఫర్ట్ పెట్టిన చందు కథనం పై శ్రద్ద పెట్టి ఉంటే బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టేవాడు. తండేల్ కి బిగ్గెస్ట్ ఎసర్ట్ దేవిశ్రీప్రసాద్ అని చెప్పొచ్చు. పాటలు థియేటర్స్ లో ఇంకా బాగున్నాయి. 'హైలెస్సా, బుజ్జి తల్లి' పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో, తెరపై అంతే అందంగా అలరించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. పుష్ప 2 తరువాత తండేల్ కీ దేవిశ్రీకి మంచి మార్కులు పడ్డాయి. శామ్ దత్ సినిమాటోగ్రఫీ వర్క్ సూపర్ గా ఉంది. సముద్రంలో తుఫాన్ సీన్స్ ని తెరకెక్కించిన విధానం బాగుంది.నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ లో ఆ విషయం అర్థం అవుతోంది. నాగేంద్ర కుమార్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి న్యాచురాలిటీ ని తీసుకువచ్చింది. ఇళ్లు, పడవలు, జైలు అన్నీ చాలా న్యాచురల్ గా ఉన్నాయి.  


ప్లస్ పాయింట్స్ 

నాగ చైతన్య 
సాయి పల్లవి 
దేవి శ్రీ ప్రసాద్ 


మైనస్ పాయింట్స్ 

కథ, కథనం 
సెకండ్ హాఫ్ 
 

ఫైనల్ వర్దిక్ట్: నిజాయితీగా చేసిన ప్రయత్నం 'తండేల్'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS