కరోనా వల్ల.. ఈ యేడాదంతా చప్పగా సాగిపోయింది. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనా.. థియేటర్లు తెరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా, బాక్సాఫీసు దగ్గర సందడి ప్రారంభం కాలేదు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వమే థియేటర్లు తెరచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఓకే అంటే గానీ, కొత్తసినిమాలు రావు. అయితే డిసెంబరు 11 నుంచి తెలుంగాణలోనూ థియేటర్లు తెరచుకోవచ్చని ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది.
ఇది నిజంగా చిత్రసీమకు శుభవార్తే.కాకపోతే.. సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉండాలి? అనే విషయంలో క్లారిటీ లేదు. డిసెంబరు 11 నుంచి థియేటర్లు ఓపెన్ అయినా, 11నే కొత్త సినిమాలు రావు. నిర్మాతలు ఇప్పుడు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. థియేటర్లు తెరిచే అవకాశం ఇచ్చినా, కనీసం రెండు మూడు వారాలు ఆగి, పరిస్థితిని గమనించే వీలుంది. అసలు ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చే మూడ్ ఉందా? లేదా? అనేదీ చూసుకోవాలి.
అంటే.. ఈ డిసెంబరు మొత్తం కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశమే లేదు. కొత్త సినిమా చూడాలంటే, మళ్లీ థియేటర్ల దగ్గర ప్రేక్షకుల తాకిడి కనిపించాలంటే ఈ డిసెంబరు గురించి మర్చిపోయి, జనవరి వరకూ ఆగాల్సిందేనేమో..?