రెండు చేతులా సంపాదించడం ఎలాగో.. మన సినిమా హీరోల్నీ, హీరోయిల్నీ చూసి నేర్చుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రం వీళ్లంతా భలే పాటిస్తుంటారు. అందుకే కొంతమంది సినీ స్టార్లు వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. ఓ పక్క సినిమాలు, మరోవైపు వ్యాపారాలు చేసుకుంటూ జోరుగా సంపాదిస్తున్నారు. అయితే ఈ కరోనా టైమ్... వాళ్లని బాగా ఇబ్బంది పెడుతోంది. లాక్ డౌన్ వల్ల వ్యాపారాలన్నీ ఆగిపోయాయి. దాంతో.. ఇటు సినిమాల్లేక, అటు వ్యాపారాలూ నష్టం వచ్చి.. రెండింతిల ఇబ్బందుల్ని ఎదుర్కుంటున్నారు.
సందీప్ కిషన్‌కి `వివాహ భోజనంబు` అనే రెస్టారెంటు ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఈ హోటెల్ ఇప్పుడు మూసేశారు. అయితే నిర్వహణ వ్యయం మాత్రం భరించాల్సివస్తోంది. రెస్టారెంటు అద్దె, కరెంటు బిల్లులూ, సిబ్బంది జీత భత్యాలూ... సందీప్ చెల్లించాల్సివస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్‌కీ ఇదే బాధ. తనకు హైదరాబాద్, విశాఖపట్నంలలో వ్యాయామ శాలలున్నాయి. లాక్ డౌన్ వల్ల నెల రోజుల నుంచి అవి బంద్. అయితే సిబ్బంది జీతాలూ, నిర్వహణా వ్యయం అన్నీ రకుల్ భరించాల్సివస్తోంది. మహేష్ కూడా అంతే కదా. హైదరాబాద్‌లో ఏఎంబీ మాల్ ఉంది. ఈ మల్టీప్లెక్స్ వ్యాపారంలో మహేష్ భాగస్వామి. మళ్లీ థియేటర్లు తెరచుకునేంత వరకూ... సిబ్బంది జీత భత్యాలు, మాల్ నిర్వహణా వ్యయం.. ఇవన్నీ మహేష్ చూసుకోవాల్సివస్తోంది.
విజయ్ దేవరకొండ వ్యక్తిగత సిబ్బంది 35 మంది వరకూ ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో వాళ్ల అవసరాలన్నీ.. విజయ్‌నే చూసుకోవాల్సివస్తోంది. నవదీప్ కూడా ఈమధ్యే ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంలోకి దిగాడు. సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్‌కి ఉపయోగపడేలా మాన్ పవర్‌నీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌నీ చూసుకోవడానికి ఓ వేదిక కల్పించాడు. గత నెల రోజులలుగా ఈ సంస్థ కార్యకలాపాల్ని కొనసాగించడం లేదు. వీళ్లే కాదు. వ్యాపార రంగంలో ఉన్న ప్రతీ నటుడు, నటి.. పరిస్థితి ఇంతే. లాక్ డౌన్ ఎత్తేసి, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకూ వీళ్లు ఈ నష్టాలు భరించాల్సిందే.