ఏప్రిల్ 14వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి చేరుకోవచ్చు. కానీ, ఇంకొన్నాళ్ళు అత్యంత అప్రమత్తంగా వుండక తప్పదు. మరోపక్క, కొత్తగా నమోవదువుతన్న కోవిడ్ 19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఈ నేపథ్యంలో, తెలుగు సినీ పరిశ్రమ దాదాపుగా ఏప్రిల్‌పైన కూడా ఆశలు వదిలేసుకున్నట్లే కన్పిస్తోంది. ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఆగిపోవడం, వచ్చే నెలలోనూ విడుదలవ్వాల్సిన సినిమాలు వుండడం.. వెరసి, మే నెలల మీద ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది.
అయితే, మే నాటికైనా పరిస్థితులు అనుకూలంగా వుంటాయా.? లేదా.? అన్నదానిపై తెలుగు సినీ పరిశ్రమలో భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ‘ఇది అత్యంత ప్రత్యేకమైన సందర్భం. దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చింది. ఇప్పుడు సినిమాల గురించిన ఆలోచన లేనే లేదు. ప్రజా భద్రతకి సినీ పరిశ్రమ అధిక ప్రాధాన్యతనిస్తుంది. సినీ పరిశ్రమలో కార్మికుల్ని ఆదుకోవాల్సి వుంది.. అదే సమయంలో, ప్రజలే సినిమాకి దేవుళ్ళు.. వాళ్ళనీ కాపాడుకోవాలి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తమకు తోచిన విధంగా సాయం చేయడం మీదనే దృష్టిపెట్టింది..’ అంటూ ఓ సినీ ప్రముఖుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.