అందాల భామ త్రిషకి కుక్కలంటే అమితమైన ప్రేమ. వీధి కుక్కల పట్ల ఎంతో దయ చూపిస్తుందామె. వాటి సంరక్షణ బాధ్యతలు చూడటంలో చెప్పలేనంత ఆనందం ఉందని చెబుతుంటుంది త్రిష. వేలు, లక్షలు పోసి ఖరీదైన కుక్కల్ని పెంచుకునేవారు, వీధి కుక్కల పట్ల కనీస దయ చూపించమని 'పెటా' సంస్థ ద్వారా ప్రచారం చేయడమే కాకుండా వ్యక్తిగతంగా తాను కూడా అలాంటి కుక్కల్ని పెంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది త్రిష. తాజాగా త్రిష 'కుక్కల టీమ్'లోకి ఓ కొత్త కుక్క వచ్చి చేరింది. దాని పేరు కూడా జూనియర్ కృష్ణన్ అట. క్యాడ్బరీ అనే పేరుతో తన వద్ద ఒకప్పుడు ఉన్న కుక్క ప్లేస్‌లోకి ఇది వచ్చి చేరిన కారణంగా, క్యాడ్బరీ జూనియర్ కృష్ణన్ అనే పేరుతో ఈ కొత్త కుక్కని పిలుచుకుంటోంది. ఇది కూడా పెంపుడు కుక్క కాదు, వీధి కుక్కే. త్రిష పెంచుకుంటోంది గనుక దీని దశ తిరిగింది. సెలబ్రిటీ డాగ్‌గా ఈ క్యాడ్బరీ జూనియర్ కృష్ణన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకు ముందు క్యాడ్బరీని తన కుమారుడిగా చెప్పుకున్న త్రిష, క్యాడ్బరీ జూనియర్ కృష్ణన్‌ని తన కుమార్తెగా పేర్కొంది. బాలీవుడ్ భామ సుస్మితా సేన్ ఇద్దరు చిన్నారుల్ని దత్తత తీసుకుని, వారికి తల్లిగా మారితే త్రిష వీధి కుక్కల్ని ఆదరించి, వాటిని పెంచుకుంటూ, వాటికి తల్లిగా మారిపోతోంది. వీధి కుక్కల పట్ల ఇంతటి ఆదరణను చూపిస్తున్న త్రిషని అభినందించకుండా ఉండలేం.