తన కెరీర్ విషయంలో అల్లు అర్జున్ పూర్తి క్లారిటీతో ఉంటాడు. ఏ సినిమా తరవాత ఎలాంటి కథ ఎంచుకోవాలి? సినిమా సినిమాకీ ఎలాంటి వేరియేషన్లు చూపించాలి? అనే విషయంలో ఆయనలో స్పష్టత ఉంది. ఓ ఫ్యామిలీ డ్రామా, మళ్లీ ఓ మాస్ సినిమా.. ఇలా ఆయన ప్రయాణం సాగుతోంది. `పుష్ప`తో మాస్ ని ఆయన ఆకట్టుకున్నారు. డివైడ్ టాక్ వచ్చినా సరే, ఈ సినిమాలో బన్నీ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కాకపోతే... అలా వైకుంఠపురములో సినిమాని చూసినట్టు పుష్పని ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు. ఎందుకంటే ఇది పూర్తి మాస్ సినిమా. బన్నీ భాషలో చెప్పాలంటే నేల మాస్ సినిమా.
బన్నీ తరవాతి సినిమా కూడా పూర్తి మాస్ సినిమానే. బన్నీ-బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. బోయపాటి అంటే యాక్షన్ మసాలా. కాబట్టి అది కూడా పూర్తిగా మాస్ ని ఉద్దేశించిందే. అందుకే ఈ గ్యాప్‌లో ఓ ఫ్యామిలీ డ్రామా చేయాలనుకుంటున్నాడట బన్నీ. అందుకే త్రివిక్రమ్ కి టచ్‌లోకి వెళ్లబోతున్నట్టు టాక్. నిజానికి పుష్ప 1 అవ్వగానే, పుష్ప 2 చేయాలి. కానీ బన్నీ మాత్రం దానికంటే ముందు ఓ ఫ్యామిలీ డ్రామా చేయాలనుకుంటున్నాడట. అందుకే త్రివిక్రమ్‌ని నమ్ముకుంటున్నాడు. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రావాల్సింది. అయితే ఇప్పుడు అది కాస్త సందిగ్ఢంలో పడింది.
మహేష్ మోకాలికి శస్త్ర చికిత్స జరగబోతోంది. ఆ కారణంగా దాదాపు 5 నెలలు మహేష్ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఈలోగా మహేష్ - త్రివిక్రమ్ కాంబో లేనట్టే. ఈ ప్లేస్ లో బన్నీతో త్రివిక్రమ్ సినిమాని పట్టాలెక్కించే ఛాన్సు ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా అయ్యాకే.. పుష్ప 2కి బన్నీ డేట్లు ఇస్తాడట. ఆ తరవాత బోయపాటి శ్రీను సినిమా ఉండొచ్చని టాక్.