ప్రతీ దర్శకుడికీ ఓ స్టైల్ ఉంటుంది. అదే వాళ్ల బలం. అయితే ఒక్కోసారి అదే బలహీనతగానూ మారుతుంటుంది. ఆ మూసలోంచి వాళ్లు బయటకు రాలేదు. హిట్ ఫార్మెట్ వదిలి... మరోలా ఆలోచించలేరు. కొన్నిసార్లు ఒకే ఫార్మెట్‌లో సినిమాలు తీయడం సేఫ్ జోన్ అనిపించుకొన్నా.. ఇది తప్ప మరోలా సినిమా తీయలేరా? ఇంకోలా ఆలోచించలేరా? అనే విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకే కథని ఎన్నిసార్లు తిప్పి తిప్పి చూపిస్తారంటూ.. అభిమానులు సైతం విమర్శిస్తుంటారు. త్రివిక్రమ్ కూడా ఇప్పుడు ఒకే మూసలో ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తోంది.
టాలీవుడ్ లోని అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకడు. ఆయన ఇమేజ్... మాటలతో కొలవలేనిది. మాటలే.. ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాయి. అయితే త్రివిక్రమ్ ఒకే ఫార్మెట్‌లో కథలు అల్లుతున్నాడేమో అనిపిస్తోంది. అత్తారింటికి దారేది తీసుకోండి. ఓ అత్త కోసం హీరో చేసిన ప్రయాణం. ఓ పెద్ద ఇల్లు.. హుందాతనం నిండిన పాత్రలు, వాళ్ల మధ్య ఎమోషన్ ఇవే చూపించాడు. క్లిక్ అయ్యింది. ఆ తరవాత.. దాదాపు ఇలాంటి కథలే అల్లుకొన్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అజ్ఞాత వాసి, అలా వైకుంఠపురములో... ఇలా ఏ సినిమా చూసినా ఇంటి సెటప్ మారలేదు. ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులోనూ అనుబంధాలూ, ఆత్మీయతలే కథా వస్తువు. తాతయ్య కోసం మనవడు చేసే ప్రయాణం ఈసినిమా. ఇక్కడ కూడా ఓ భారీ ఇంటి సెటప్, అందులో.. హుందాతనం నిండిన పాత్రలూ.. ఇవే కనిపించబోతున్నాయని సమాచారం. ఈ కథాగమనం కూడా అత్తారింటికి దారేది స్టైల్‌లోనే సాగుతుందని ప్రచారం జరుగుతోంది. దాంతో త్రివిక్రమ్ ఈ మూసలోంచి బయటకు రాడా? అంటూ అభిమానులే నొసలు చిట్లిస్తున్నారు. కాకపోతే ఒకటి. త్రివిక్రమ్ దగ్గర ఓ మ్యాజిక్ ఉంటుంది. పాత కథనే కొత్తగా చూపిస్తారు. హీరోల్ని, వాళ్ల ఎమోషన్స్ నీ కొత్త రీతిలో ఆవిష్కరిస్తారు. అందుకే హిట్లు కొడుతున్నాడు. అది నచ్చే.. మహేష్ ఈ సినిమా ఒప్పుకొని ఉంటాడేమో..?