మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు జరిగిపోయింది. ఆర్.ఆర్.ఆర్ నుంచి ఫస్టు లుక్కులూ, టీజర్లూ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే విశ్వక్సేన్ పాట విడుదల చేయడం, బిగ్ బాస్ టీమ్ ఓ వీడియో చేయం, సిక్స్ ప్యాక్ ఫొటో, దానికి తోడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కాస్త కాలక్షేపాన్ని అందించగలిగాయి. త్రివిక్రమ్ సినిమా నుంచి ఏదైనా సర్ప్రైజ్ వస్తుందేమో అని ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి `అయిననూ పోవలె హస్తినకు` అనే టైటిల్ ఫిక్స్ చేశారని అంతా అనుకుంటున్నారు. ఎలాగూ బయటకు వచ్చేసింది కదా అని ఆ టైటిల్ని అధికారికంగా ప్రకటిస్తారని భావించారు. కానీ.. త్రివిక్రమ్ టీమ్ చప్పుడు చేయలేదు. బహుశా.. ఆసినిమాకి ఇంకా టైమ్ ఉంది కదా. ఇప్పటి నుంచే పబ్లిసిటీ మొదలెట్టడం ఎందుకని భావించి ఉంటారు. లేదంటే టైటిల్ పై పునరాలోచనకి దిగి ఉంటారు. అందుకే ఎన్టీఆర్ పుట్టిన రోజున త్రివిక్రమ్ టీమ్ ఏమాత్రం తొందరపడలేదు. దీనికి సంబంధించిన అప్ డేట్ ఎప్పుడొస్తుందో మరి చూడాలి.