అన్ లాక్ 4తో థియేటర్లకు అనుమతులు ఇస్తారని, కొత్త సినిమాల్ని విడుదల చేసుకోవొచ్చని ఆశించిన నిర్మాతలకు భంగపాటు ఎదురైంది. ఈసారీ.. థియేటర్లకు అనుమతులు రాలేదు. థియేటర్లు, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్... వీటికి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. దాంతో.. సెప్టెంబరు నెల కూడా.. కరోనా ఖాతాలో కొట్టుకుపోయినట్టే. అక్టోబరులో థియేటర్లు ఓపెన్ అయినా.. చిత్రసీమకు ఏమాత్రం ఉపయోగం ఉండదు.ఎందుకంటే... అక్టోబరులో అనుమతులు ఇచ్చినా.. సినిమాల్ని రెడీ చేసుకుని, విడుదల చేసుకోవడానికి మరో నెల పడుతుంది. అంటే.. దసరా సీజన్ కూడా అయిపోయినట్టే. నవంబరు, డిసెంబరు సినిమా పరిశ్రమకు మరింత బ్యాడ్ సీజన్.
ఈ సీజన్‌లో సినిమాల్ని విడుదల చేసుకోవాలని ఏ నిర్మాతా అనుకోడు. అంటే.. ఒకవేళ అక్టోబరులో థియేటర్లు తెరచినా.. సినిమాలేం రావు. ఇక కొత్తసినిమాల్ని థియేటర్లో చూడాలంటే.. సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. అంటే. 2020ని టాలీవుడ్ పూర్తిగా మర్చిపోవాలన్నమాట. మొత్తానికి థియేటర్ల కష్టాలు రానున్న రోజుల్లోనూ కొనసాగబోతున్నాయన్నది అర్థం అవుతోంది. ఇక ఓటీటీలే గతి.