గురువారం శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా శ్రీదేవి అభిమానులు ‘సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి’ పేరుతో.. హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. దాంతో శ్రీదేవి మృతిపై మళ్లీ చర్చ మొదలవ్వాలన్నది వాళ్ల ఆలోచన, ఆశ. రెండేళ్ల క్రితం దుబాయ్‌లోని ఆ హోటెల్ లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది శ్రీదేవి. అది ప్రమాదవశాత్తూ సంభవించిన మరణం అని పోలీసులు సైతం ధృవీకరించారు. అయితే ఇప్పటికీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి. రెండేళ్ల తరవాత ఇప్పుడు మళ్లీ ఈ కేసుని తవ్వి బయటకు తీస్తున్నారు శ్రీదేవి ఫ్యాన్స్.
ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముందు అది ఆత్మహత్యే అని పోలీసులు లైట్ తీసుకున్నారు. సీబీఐ ఎంక్వైరీ కోసం అభిమానులు డిమాండ్ చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సుశాంత్ అభిమానులు మాత్రం ఊరుకోలేదు. హ్యాష్ ట్యాగులతో హోరెత్తించారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ కేసుని సీబీఐ కి అప్పగించింది. అలానే... శ్రీదేవి మరణంపైనా సీబీఐ విచారణ మొదలవుతుందని శ్రీదేవి అభిమానుల ఆశ. మరి ఈ హ్యాష్ ట్యాగులకు ప్రభుత్వం స్పందిస్తుందా.? లేదా? అనేది చూడాలి.