ఉదయ్ కిరణ్.. ఉవ్వెత్తున లేచి పడిన కెరటం. అతి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరో అయిపోయాడు. ఎంత త్వరగా ఎదిగాడో... అంతే త్వరగా కిందకు పడ్డాడు. చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇప్పటికీ హాట్ టాపిక్కే. తను ఎందుకు చనిపోయాడు? దాని వెనుక ఎవరు ఉన్నారు? అనే ప్రశ్నలు ఇప్పటికీ తన అభిమానుల్ని వేధిస్తూనే ఉంటాయి. ఒకొక్కరూ ఒక్కో కోణంలో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికీ ఉదయ్ ఆత్మహత్య అనేది మిస్టరీనే. అయితే.. ఇప్పుడు ఉదయ్ ఆత్మహత్య మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఉదయ్ కిరణ్ చివరి సారి రాసిన లేఖ అంటూ.. ఓ ఉత్తరం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆ లేఖ తన భార్యకు రాసినదట. వారిద్దరి మధ్య గొడవలు ఎందుకొచ్చాయో ఆ లేఖలో ఉదయ్ పేర్కొన్నాడని, అమ్మ దగ్గర తీసుకున్న నగల్ని... తన సోదరికి తిరిగి ఇచ్చేయాలని అందులో ఉదయ్ కోరాడని, తన తల్లి తనకెంతో గుర్తుకు వస్తుందని, తల్లి ని కౌగిలించుకుని ఏడ్వాలని ఉందని, అందుకే తన తల్లి దగ్గరకు వెళ్లి పోతున్నానని ఆ లేఖలో ఉదయ్ కిరణ్ పేర్కొన్నాడట. అదే ఉదయ్ సూసైడ్ నోట్ అని.. ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా, లేదంటే... కేవలం ఎవరో సృష్టించిన లేఖా? అనేది మాత్రం తెలియడం లేదు. ఏది ఏమైనా.. ఈ రూపంలో మరోసారి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వార్తల్లోకి వచ్చింది.