ఒక సాధారణ మిల్లు కార్మికుని ఇంట్లో పుట్టి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఉమా ప్రేమన్ జీవిత గాథ బయోపిక్‌గా రాబోతోంది. దాదాపు 2 లక్షల డయాలసిస్‌లు, 20 వేలకు మించిన గుండె శస్త్ర చికిత్సలు, వందలాడి కిడ్నీ మార్పిడులు, గిరిజనుల కోసం పాఠశాలలు, తక్కువ ఖర్చుతో ఇళ్లు.. వంటివి ఉమా ప్రేమన్ చేసిన సేవల్లో కొన్ని. ఈ సేవలతో దేశంలోని ఎంతోమంది నిరుపేదల జీవితాలను ఆమె మార్చేశారు. అంతేకాదు, దేశంలోనే ఆమె మొట్టమొదటి పరోపకార మూత్రపిండ దాత.
తనకు ఏమాత్రమూ తెలీని ఓ టీనేజర్‌కు ఉమా ప్రేమన్ తన కిడ్నీని దానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా రియల్ హీరో అవార్డు అందుకున్న మహిళల్లో ఆమె ఒకరు. అటువంటి అసాధారణ మహిళ జీవితం త్వరలో బహు భాషా బయోపిక్‌గా రూపొందనున్నది.'ట్రాఫిక్ రామసామి' ఫేమ్ విఘ్నేశ్వరన్ విజయన్ ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. దర్శకుడు విఘ్నేశ్వరన్ విజయన్ మాట్లాడుతూ, "నిస్వార్థప్రేమను మించిన గొప్ప విషయం మరొకటి లేదు. తన చుట్టూ ఉన్నవాళ్లు బాధపెట్టినప్పుడల్లా వారికి ఉమా ప్రేమన్ మరింత ప్రేమను సమాధానంగా ఇచ్చేవారు. పలువురికి ఈ సినిమా స్ఫూర్తిదాయకం అవుతుందని నేను నమ్ముతున్నాను. నిస్పృహతో ఉన్న యువత ఈ సినిమా చూస్తే, ఒక సాధారణ అమ్మాయి ఎలా అడ్డంకుల్ని అధిగమించి, ఈ ప్రపంచంలో తనదైన ముద్రను ఎలా వేసిందో తెలుస్తుంది" అన్నారు.
ఈ ఉద్వేగభరిత, వినోదాత్మక ఫిమేల్ సెంట్రిక్ బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లతో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతోంది. ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.