సుప్రీం హీరో సాయిధర్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’ సినిమా ఈ నెల మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. కరోనా వైరస్ దెబ్బకి అన్ని సినిమాల్లానే ‘ఉప్పెన’ సినిమా కూడా విడుదలకు నోచుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశమే లేదనీ, డిసెంబర్‌లో విడుదలైతే అది గొప్ప విషయమేనంటూ కొన్ని గాసిప్స్ విన్పిస్తున్నా, లాక్‌డౌన్ ఎత్తివేశాక వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.
ఇదిలా వుంటే, ‘ఉప్పెన’ సినిమాలో బోల్డన్ని ట్విస్ట్‌లు వుంటాయట. అందులో క్లయిమాక్స్ ట్విస్ట్ అందర్నీ షాక్‌కి గురిచేస్తుందనీ, అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోందని ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. సుకుమార్, రావ్‌ుచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలోనూ క్లయిమాక్స్ ట్విస్ట్ అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఆ సినిమా విజయంలో ఆ ట్విస్ట్ కీలక భూమిక పోషించింది. అలాంటి ట్విస్ట్‌లు ‘ఉప్పెన’లో చాలానే వున్నాయనీ, సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సన దర్శకుడిగా తన మేకింగ్ టాలెంట్ ఏంటో ఈ సినిమాతో చూపించబోతున్నాడనీ అంటున్నారు.
దర్శకుడిగా బుచ్చిబాబు సనకి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభిస్తుందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. కృతి శట్టిె ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయనుకోండి.. అది వేరే సంగతి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.