ఈ మధ్య టాలీవుడ్ అంతా ఓటీటీ వైపు ఆశగా చూస్తోంది. మంచి రేటొస్తే - సినిమాల్ని అమ్ముకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. అంతో ఇంతో క్రేజ్ ఉన్న సినిమాలు సైతం - ఓటీటీలే సో బెటరని నమ్ముతున్నాయి. కొన్ని సినిమాలకు ఓటీటీ నుంచి ఊహించని రేట్లూ వస్తున్నాయి. ఈమధ్య `గుడ్ లక్ సఖీ`, `వి` సినిమాలు ఓటీటీ వైపుకు వెళ్లిపోయాయి.
ఇప్పుడు `ఉప్పెన` సినిమాకీ మంచి ఆఫర్ వచ్చిందని టాక్. ఈ సినిమాని 13 కోట్లకు కొంటామని ఓ ఓటీటీ సంస్థ ముందుకు వచ్చింది. వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఇది. హీరోకీ, హీరోయిన్‌కీ, దర్శకుడికీ ఇదే తొలి సినిమా. కాబట్టి 13 కోట్లంటే మంచి బేరమే. కానీ... మైత్రీ మూవీస్ ఈసినిమా అమ్మడానికి ససేమీరా అంటోంది. దానికి కారణం.. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అవ్వడమే. నిజానికి 15 కోట్లలోపు ఈ సినిమాని పూర్తి చేయాలని నిర్మాతలు భావించారు. కానీ.. సినిమాపై నమ్మకంతో బడ్జెట్ పెంచుకుంటూ పోయారు. థియేటర్లలో విడుదలై, మంచి టాక్ వస్తే, పాతిక కోట్లు రికవరీ చేయడం అంత కష్టమేమీ కాదు. కానీ.. ఓటీటీ అంతకు కొనదు కదా..? అందుకే ఈ సినిమాని ఓటీటీకి అమ్ముకోలేకపోతున్నారు. ఎన్ని సినిమాలు ఓటీటీలోకి వెళ్లిపోయినా, ఉప్పెన మాత్రం... థియేటర్లలోనే విడుదల అవుతుందని టాక్.