'వజ్ర కవచధర గోవింద' మూవీ రివ్యూ రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు.
దర్శకత్వం: అరుణ్ పవర్
నిర్మాతలు: నరేంద్ర, జీవిఎన్ రెడ్డి
సంగీతం: బుల్గానియన్
సినిమాటోగ్రఫర్: ప్రవీణ్ వనమాలి  
విడుదల తేదీ: జూన్ 14, 2019

 

రేటింగ్‌: 2/5

 

స‌ప్త‌గిరికి హాన్య‌న‌టుడిగా మంచి డిమాండ్ ఉంది. చిత్ర‌సీమ‌లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న న‌టుల్లో స‌ప్తగిరి ఒక‌డు. అయితే అప్పుడ‌ప్పుడూ హీరోగా అవ‌తారం ఎత్తి - త‌న హీరోయిజం చూపించాల‌నుకుంటుంటాడు. అందులో భాగంగానే `స‌ప్తగిరి ఎక్స్ ప్రెస్‌`, `స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బీ` చిత్రాలొచ్చాయి. అందులో స‌ప్త‌గిరి హీరోనే అయినా - వాటి ప్ర‌ధాన ఉద్దేశ్యం ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డ‌మే. ఇప్పుడు మ‌రోసారి స‌ప్త‌గిరి హీరో అయిపోయాడు.. `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమాతో. మ‌రి ఈ సినిమాలోనూ స‌ప్త‌గిరి య‌ధావిధిగా న‌వ్వించాడా?  ఆ గోవిందుడి వ‌జ్రం గోలేంటి? ఆ క‌థేంటి?

 

* క‌థ‌

గోవిందు (స‌ప్తగిరి) ఓ అల్ల‌రి దొంగ‌.  గుప్తుల వారి కాలం నాటి నిధుల కోసం ఓ ముఠా ప్ర‌యత్నిస్తుంటే, వాళ్ల‌కు సాయంగా వెళ్తాడు. ఆ నిధుల కోసం అన్వేషిస్తుంటే ఓ ఖ‌రీదైన వ‌జ్రం దొరుకుతుంది. ఆ వ‌జ్రం విలువ దాదాపు 200 కోట్లు. ఆ వ‌జ్రాన్ని అమ్మి, అంద‌రూ స‌మానంగా పంచుకోవాల‌నుకుంటారు.

 

అయితే ఆ వ‌జ్రం ఎక్క‌డ పెట్టాడో మ‌ర్చిపోతాడు గోవిందు. గోవిందు నిజంగా మ‌ర్చిపోయాడా?  లేదంటే వ‌జ్రం కోసం నాట‌కం ఆడుతున్నాడా?  చివ‌రికి వ‌జ్రం ఏమైంది? గోవిందు దొంగ‌గా మార‌డానికి అస‌లు కార‌ణం ఏమిటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` చూడాలి. 

 

* న‌టీన‌టులు

హీరోగా నిరూపించుకోవాల‌ని స‌ప్త‌గిరి చాలా ఉంది. అందుకే రెండు ప్ర‌య‌త్నాలు బెడ‌సికొట్టినా ముచ్చ‌ట‌గా మూడో సినిమా తీయ‌గ‌లిగాడు.  అయితే క‌థ‌ల ఎంపిక‌లో స‌ప్త‌గిరి జాగ్ర‌త్త‌గా ఉండాలి. త‌నకు సూట‌య్యే సినిమాలే చేయాలి. స‌ప్త‌గిరి ఎంత చేసినా - త‌న నుంచి కామెడీనే ఆశిస్తారు. అందుకే ఎమోష‌న్ డోసు త‌గ్గించి, ఆ మాట‌కొస్తే అవ‌న్నీ లేకుండా సినిమాలు చేస్తే బాగుంటుంది. గోవిందుగా స‌ప్త‌గిరి న‌ట‌న బాగుంది. కామెడీ పండిచే చోట ఎప్ప‌ట్లా స‌హ‌జంగా చేశాడు. క‌థానాయిక ఏమాత్రం గ్లామ‌ర్‌గా లేదు. స‌ప్త‌గిరి ప‌క్క‌న న‌టించ‌డానికి ఎవ‌రూ ముందుకు రాక‌పోతే... ఆమెను తీసుకున్నారేమో అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. బంగార‌య్య‌గా న‌టించిన న‌టుడెవ‌రో గానీ, అన్నీ అరుపులే. జ‌బ‌ర్‌ద‌స్త్ గ్యాంగ్ చివ‌ర్లో వ‌చ్చి సంద‌డి చేసింది. మిగిలిన‌వాళ్లెవ్వ‌రివీ చెప్పుకోద‌గిన పాత్ర‌లు కావు.

 

* సాంకేతిక వ‌ర్గం

చాలా బ‌ల‌హీన‌మైన క‌థ ఇది. ఇలాంటి క‌థ‌తో ద‌ర్శ‌కుడు నిర్మాత‌ల్ని ఒప్పించాడంటే గ్రేటే. క‌థ స‌రిగా లేనప్పుడు పాత్ర‌లైనా స‌రిగా రాసుకోవాలి. క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ సృష్టించుకోవాలి. ఆ విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయ్యాడు. అక్క‌డ‌క్క‌డ కాస్త కామెడీ పండింది. చాలా చోట్ల విసిగిస్తాడు. ద్వితీయార్థం చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. అస‌లు అక్క‌డ చెప్ప‌డానికి క‌థే మిగ‌ల్లేదు. పాట‌లు ఓకే అనిపిస్తాయి. చిన్న సినిమా అయినా క్వాలిటీ ప‌రంగా బాగానే ఉంది.

 

* విశ్లేష‌ణ‌

నిధుల అన్వేష‌ణ‌లో సాగే క‌థ‌లు చాలా వ‌చ్చాయి. ఇదీ అలాంటిదే. కాక‌పోతే.. నిధుల అన్వేష‌ణ కోసం మొద‌లైన ఈ క‌థ‌.. ఆ త‌ర‌వాత ఎటెటో వెళ్లిపోతుంది. స‌గం గ‌డిచాక నిధి గురించి మ‌ర్చిపోయి - హీరో మ‌తిమ‌రుపు, పిచ్చి, మిగిలిన క్యారెక్ట‌ర్ల పైత్యం చుట్టూ న‌డుస్తుంటుంది. దాంతో ఈ క‌థ ఎక్క‌డ మొద‌లైంది?  చివ‌రికి ఏమైంది? అనే గంద‌ర‌గోళంలో ప‌డిపోతాడు ప్రేక్ష‌కుడు. తొలి స‌న్నివేశాలు స‌ప్త‌గిరి పాత్ర‌కు, త‌న శైలికి త‌గిన‌ట్టు వినోదాత్మ‌కంగానే సాగాయి.

 

దొంగ‌గా స‌ప్త‌గిరి చేసిన విఫ‌ల యాత్నాలు, ఆ త‌ర‌వాత స్వామీజీగా అవ‌తారం ఎత్త‌డం, నిధి కోసం జ‌రిగే అన్వేష‌ణ ఇవ‌న్నీ న‌వ్విస్తాయి. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువైంది. అందులో డ్రామా మ‌రింత ఎక్కువ‌గా సాగింది. స‌ప్త‌గిరి సినిమాకి న‌వ్వుకోవ‌డానికి వ‌స్తారు. ఇలాంటి ఎమోష‌న్ సీన్లు చూడ్డానికి కాదు. అలాంటి స‌న్నివేశాల్ని వీలైనంత త‌గ్గించుకుని, కామెడీ ట్రాక్ పెంచుకుంటే బాగుండేది. ఆ ఫ్లాష్ బ్యాక్ మిన‌హాయిస్తే - తొలి స‌గం టైమ్ పాస్ అయిపోతుంది.

 

అయితే చిక్కంతా ద్వితీయార్థంలోనే. అక్క‌డ ద‌ర్శ‌కుడికి చెప్ప‌డానికి ఏం మిగ‌ల్లేదు. దాంతో హీరో గ‌తం మ‌ర్చిపోవ‌డం అనే ఎఫెక్ట్ పెట్టాడు. అలా హీరో వజ్రం ఎక్క‌డ పెట్టాడో కూడా మ‌ర్చిపోతాడు. అక్క‌డి నుంచి ప్ర‌హ‌స‌నం మొద‌లవుతుంది. గోవిందుకు గ‌తం గుర్తుకు తేవ‌డానికి కామెడీ గ్యాంగ్‌, విల‌న్ టీమ్ చేసే ప్ర‌య‌త్నాలు ఏమాత్రం న‌వ్వు పంచ‌వు. హీరో గ‌తం మ‌ర్చిపోవ‌డానికి కూడా ఓ బ‌ల‌మైన కార‌ణం ఉందేమో అనుకుంటే, దాన్ని మ‌రింత సిల్లీగా చూపించేశారు. చివ‌రికి వ‌జ్రం వెనుక కూడా ఓ ట్విస్టు ఉంది. అది మ‌రింత అన‌వ‌స‌రం. చివ‌ర్లో స‌ప్త‌గిరి మాస్ హీరోలా రెచ్చిపోయి ఫైటింగులు చేస్తాడు. త‌న ఊరి స‌మ‌స్య తీరిపోతుంది. క‌థ సుఖాంతం అవుతుంది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 
+సప్త‌గిరి
+కొన్ని కామెడీ దృశ్యాలు

 

* మైన‌స్ పాయింట్స్

-క‌థ‌, క‌థ‌నం
-మితిమీరిన మెలోడ్రామా

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: గోవిందా.. గోవిందా

 

- రివ్యూ రాసింది శ్రీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS