ఎన్నాళ్లకో బాక్సాఫీసు దగ్గర ఓ ఉధృతి చూశారు తెలుగు సినిమా జనాలు. అదంతా 'వకీల్ సాబ్' మహత్తు. దాదాపు మూడేళ్ల విరామం తరవాత... పవన్ కల్యాణ్ చేసిన సినిమా ఇది. అభిమానులకు కావల్సిన అన్ని అంశాలూ ఉన్నాయి. అందుకే... వాళ్లంతా ఈ సినిమాని నెత్తిమీద పెట్టేసుకున్నారు. ఈమధ్య ప్రతీవారం రెండు, మూడు సినిమాలు వరుక కట్టడం ఆనవాయితీగా మారింది. కానీ `వకీల్ సాబ్` స్టామినా తెలుసు కాబట్టి, మిగిలిన సినిమాలేవీ పోటీకి రాలేదు. దాంతో సోలో రిలీజ్ దక్కింది.
తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్లలో అటూ ఇటూగా 80 శాతం థియేటర్లలో వకీల్ సాబ్ నే ఆడుతోంది. శుక్రవారం థియేటర్లన్నీ కిటకిటలాడిపోయాయి. శని, ఆదివారాలూ.. ఇదే జోష్ కొనసాగుతుంది. వచ్చేవారం `లవ్ స్టోరీ`విడుదల కావాల్సివుంది. కానీ అది వాయిదా పడింది. అంటే.. మరో రెండు వారాలు `వకీల్ సాబ్` తప్ప మరో ప్రత్యామ్నాయం లేనట్టే. పవన్ కల్యాణ్ సినిమా ఏవరేజ్ అంటేనే, తొలి మూడు రోజులూ టికెట్లు దొరకవు. ఇక హిట్ అనేస్తే... ఆ ఉధృతి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి పరిమితం చేస్తారన్న భయాలు నెలకొన్నాయిప్పుడు. ఈవారం... గండం గట్టెక్కింది. వచ్చేవారం 50 శాతానికి కుదించినా `వకీల్ సాబ్`కి వచ్చే నష్టం ఏమీ ఉండదు.ఎందుకంటే తొలివారం లోనే.. మాక్సిమం కలక్షన్లు రాబట్టేయొచ్చు.