నటీనటులు : పవన్ కళ్యాణ్, నివేత థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం : వేణు శ్రీరామ్
నిర్మాతలు : దిల్ రాజు
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫర్ : పి.ఎస్ వినోద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రేటింగ్: 3/5
పవన్ కల్యాణ్ ని వెండి తెరపై చూసి.. మూడేళ్లయిపోయింది. ఆయన రాజకీయాలంటూ బిజీ అయిపోయారు. ఓ దశలో పవన్ ఇక సినిమాలు చేయడనుకున్నారు. కానీ అభిమానుల ఆకాంక్షలకు విలువ ఇస్తూ.. పవన్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. వకీల్ సాబ్ రూపంలో. సుదీర్ఘ విరామం తరవాత వస్తున్న పవన్ సినిమా ఇది. పైగా పింక్ లాంటి సెన్సిటీవ్ సబ్జెక్ట్, సూపర్ హిట్ కథని ఎంచుకున్నాడు. ట్రైలర్లలో జోష్ కనిపించింది. మరింతకీ ఈ సినిమా ఎలా ఉంది? పవన్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్టేనా? `వకీల్ సాబ్` పింక్ స్థాయిలో ఉందా, లేదా?
* కథ
పల్లవి (నివేదా థామస్), దివ్య (అనన్య), జరీనా (అంజలి) ముగ్గురూ స్నేహితులు. ఓ రోజు రాత్రి క్యాబ్ లో ఇంటికి వస్తుండగా.. ఓ అనూహ్యమైన ఘటన జరుగుతుంది. చివరికి ఎంపి కొడుకుతోనే తలపడే స్థాయికి వెళ్లిపోవాల్సివస్తుంది. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవుతుంది. ఈ ముగ్గురు స్నేహితులూ అరెస్ట్ అవుతారు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో సత్యదేవ్ (పవన్ కల్యాణ్) ఈ ముగ్గురికీ ఎలా సాయం చేశాడు? ఎలా న్యాయం చేయగలిగాడు? అనేదే కథ.
* విశ్లేషణ
పింక్ కథకీ, వకీల్ సాబ్ కథకీ పెద్దగా తేడా లేదు. ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్, ఫ్లాష్ బ్యాక్.. ఇలా అక్కడక్కడా కొన్ని మార్పులు ఉన్నాయి. కానీ.. కథని దాటైతే ఇవేం రాలేదు. అది ఓరకంగా మంచికే.
పింక్ అనే కథలో కమర్షియల్ అంశాలేం ఉండవు. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ ఉన్నాడు కాబట్టి, వాటికి చోటు కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. పాటలు, ఫైట్లూ.. అంటూ. పవన్ కోసం కథని కాస్త పక్కదారి మళ్లించారు. అవి కొన్నికొన్ని సార్లు వర్కవుట్ అయ్యాయి. కొన్ని చోట్ల తేలిపోయాయి.
కథని ప్రారంభించిన విధానం బాగుంది. నేరుగా కథ సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. ముగ్గురు స్నేహితులూ ఓ ఆపదలో చిక్కుకోవడం, కేసుల గొడవతో మొదలవుతుంది. సత్యదేవ్ గా.. పవన్ కల్యాణ్ ఎంట్రీ తో ఈ కథ పీక్స్ కి వెళ్లిపోతుంది. పవన్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో, అలాంటి సన్నివేశంతో పవన్ ఎంట్రీ లభించింది. మూడేళ్ల తరవాత పవన్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి సీన్ తో పవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది గూజ్‌బమ్స్ ఇచ్చే ఎపిసోడ్ గా మిగిలిపోతుంది. పవన్ ఫ్లాష్ బ్యాక్ గురించి జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ ఈ సినిమా కలరే మార్చేస్తుందని భావించారు. కానీ.. ఫ్లాష్ బ్యాక్ బాగా స్లోగా నడిచించింది. ఈ కథకు అతకలేదు అనిపించింది. కేవలం పవన్ కోసం బలవంతంగా ఇరికించిన ఎపిసోడ్ గా మిగిలిపోతుంది.
ద్వితీయార్థం అంతా కోర్టు రూమ్ డ్రామానే. అక్కడ పవన్ - ప్రకాష్ రాజ్ ల మధ్య యుద్ధమే నడిచింది. వీరిద్దరి సన్నివేశాలూ... నచ్చుతాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. మధ్యమధ్యలో పడుతూ... లేస్తూ... ద్వితీయార్థం సాగిపోతుంది. అక్కడక్కడ ఫైట్స్ జోడించడం, కొన్ని పొలిటికల్ పంచ్‌లూ.. అభిమానులకు నచ్చుతాయి.క్లైమాక్స్ విషయంలో ఎలాంటి మార్పూ చేయలేదు. పింక్ నే ఫాలో అయిపోయాడు. మెట్రో స్టేషన్ ఫైట్ బాగుంది. అది కాస్త... మళ్లీ ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. మొత్తానికి.. పింక్ రీమేక్ ని చెడగొట్టలేదు. అలాగని అంతకంటే బాగా తీయలేదు. కొన్ని పంచ్ డైలాగులు, హీరోయిజం జోడించి పవన్ శైలికి అనుగుణంగా రాసుకోగలిగారు.
* నటీనటులు
పవన్ చాలా సెటిల్డ్ గా చేయాల్సిన పాత్ర ఇది. బాగానే చేశాడు. తన లుక్ అంతగా నప్పలేదేమో అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రం పవన్ బాగున్నాడు. ఖుషీ నాటి రోజులు గుర్తొస్తాయి. పవన్ - ప్రకాష్ రాజ్ మధ్య నడిచే వాదమే ఈ కథకు ప్రాణం. అక్కడ ప్రకాష్ రాజ్ తో పాటు సమానంగా నటించగలిగాడు. ప్రకాష్ రాజ్ మరో కీలకమైన పాత్ర పోషించాడు. తన అనుభవాన్ని రంగరించాడు. నివేదా, అనన్య, అంజలి.. ముగ్గురూ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రుతిహాసన్ ఇలా వచ్చి, అలా వెళ్లిపోతుందంతే.
* సాంకేతిక వర్గం
తమన్ బీజియమ్స్ అదిరిపోయాయి. తను ప్రాణం పెట్టాడు. జనగణమన.. పాట థియేటర్లో అభిమానులకు నచ్చేస్తుంది. కంటి పాప మంచి రొమాంటిక్ మెలోడీ. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. అందులో పొలిటికల్ పంచ్‌లే ఎక్కువ. జనసేన మీటింగుల్లో పవన్ స్పీచుల్లా కొన్ని సాగాయి. ఫొటోగ్రఫీ... బాగుంది. ముఖ్యంగా పవన్ ని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో. వేణు శ్రీరామ్ కథని బాగానే ఓన్ చేసుకున్నాడు. పవన్ స్టామినాకు తగినట్టు రాసుకున్నాడు. అయితే అక్కడక్కడ కోర్టు రూమ్ డ్రామా బోర్ కొట్టేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది.
* ప్లస్ పాయింట్స్
పవన్ పంచ్‌లు
పవన్ - ప్రకాష్ రాజ్ సంవాదం
నేపథ్య సంగీతం
* మైనస్ పాయింట్స్
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
పడుతూ లేస్తూ సాగిన సెకండాఫ్
ఫైనల్ వర్డిక్ట్: ఫ్యాన్స్ కు పండగ