వరలక్ష్మి శరత్ కుమార్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. శరత్ కుమార్ వారసురాలిగా కోలీవుడ్ లో సినీప్రయాణం ప్రారంభించిన ఈ అమ్మడు తరవాత టాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తెలుగు సినిమాల్లో పవర్ ఫుల్ లేడి విలన్ గా పేరుగాంచింది. ఈమె నటనకి వంక పెట్టడానికి లేదు అన్నట్టుగా నటిస్తుంది. పాత్ర ఎలాంటిది అయినా పరకాయ ప్రవేశం చేస్తుంది. తనకి ఉన్న ఇంకో ప్లస్ తన వాయిస్ అని. వరలక్ష్మి ఉంటే సినిమా హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. క్రాక్, వీరసింహా రెడ్డి, హనుమాన్ సినిమాలు ఇందుకు ఉదాహరణ. గత ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన వీర సింహ రెడ్డి సినిమాలో బాలయ్యకి చెల్లెలుగా అద్భుత నటన కనపరిచింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. 2024 సంక్రాంతికి హనుమాన్ సినిమాలో హీరో అక్కగా అంజమ్మ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో తెలిసిందే. ఇలా సంక్రాంతి సినిమాల్లో వరలక్ష్మి ఉంటే పక్కా హిట్ అన్న టాక్ ఉంది.
ఒక పక్క సినిమాలతో కెరియర్ లో బిజీగా ఉన్న టైమ్ లోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నఈ అమ్మడు జులై 2 న వివాహబంధం లోకి అడుగుపెడుతోంది. ముంబై కి చెందిన ఆర్టిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వరలక్ష్మి పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అన్న విషయాలు ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే ఇపుడు వీరి పెళ్లి గూర్చి కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వరలక్ష్మి కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్టు సమాచారం. ఈ జంట తమ వెడ్డింగ్ డెస్టినేషన్ కోసం థాయ్‌ల్యాండ్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మూడు రోజుల పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్. జులై 2 న జరిగే ఈ వివాహ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులతో పాటు, దగ్గర బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు అవనున్నట్లు సమాచారం. వరలక్ష్మి పెళ్లి తరవాత సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.