'హ్యాపీడేస్' ఫేం వరుణ్ సందేశ్, 'కొత్త బంగారు లోకం' సినిమాతో సోలో హీరో అనిపించుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చిన ఆ సినిమా ఘన విజయం సాధించింది. దాంతో ఆ తరువాత వరుస ఆఫర్లు వరుణ్ సందేశ్‌ని పలకరించాయి. అప్పట్నుంచీ స్టైలిష్ యంగ్ హీరో అన్పించుకున్నాడు. ఆ నేపథ్యంలో వచ్చిన 'ఏమైంది ఈవేళ' సినిమా కూడా వరుణ్‌కి మంచి విజయాన్ని సాధించింది. తర్వాత వరుస సినిమాలతో మనోడు చాలా బిజీగా ఉన్నాడు కానీ, అవకాశాలకు తగ్గట్టుగా హిట్స్ అతని ఖాతాలో పడకపోవడంతో హీరోగా రేసులో వెనుకబడిపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వినూత్న ప్రయోగానికి తెరలేపాడు. అదేమిటంటే 'హేకృష్ణా' అనే వెబ్ సిరీస్‌లో నటించడం. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ గురించి ఎక్కువగా వింటున్నాం. పలువురు యంగ్ హీరోలు ఈ వెబ్ సిరీస్‌పై దృష్టి పెడుతున్నారు. ఆ కోవలో వరుణ్ సందేశ్ 'హేకృష్ణా' వెబ్ సిరీస్‌తో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. లక్ష్మీకాంత్ చెన్నా ఈ 'హే కృష్ణా' వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. మరో యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు వెబ్ సిరీస్‌పై ఫోకస్ పెట్టాడు. అలాగే వరుణ్ సందేశ్ కూడా ఈ దారినే ఎంచుకోవడం అభినందించదగ్గ విషయమే. అంతేగా మరి ట్రెండింగ్‌లో ఏదుంటే దాన్ని ఫాలో అయిపోవడమే ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ వెబ్ సిరీస్ అనేది చాలామందికి బెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా మారే అవకాశాలున్నాయి.