మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం 'బాక్సర్'. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా రూపొందుతోంది. టైటిల్‌కి తగ్గట్లు వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో ఆ పాత్ర కోసం వరుణ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదట. ఎట్టకేలకు ఫిజిక్ బాగా పెంచాడు. బాక్సర్‌కి ఉండాల్సింది అదే కదా. అసలే ఆరడుగులు మించిన ఆజాను బాహుడు. ఆ కటౌట్‌కి బాక్సర్ గెటప్ అంటే అహో.. ఆ కిక్కే వేరప్పా. మరి బాక్సర్‌గా వరుణ్ తేజ్ ఎలా ఉన్నాడు..? అంటే అధికారిక ఆధారాలేం లేవు కానీ, తాజాగా ఓ ఫోటో అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఈ అందాల ఆజానుబాహుడు గుబురు గెడ్డంతో పర్‌ఫెక్ట్ ఫిజిక్‌తో దర్శనమిస్తున్నాడు.
ఈ కటౌట్ చూసిన మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారనుకోండి. ఇటీవల 'గద్దలకొండ గణేష్' అంటూ ఓ భీకరాతి భీకరమైన గెటప్‌లో కనిపించి గడగడలాడించేశాడు. ఇక ఇప్పుడు బాక్సర్‌గా ఎంతలా దడ దడలాడించేస్తాడో చూడాలి మరి. రేపో మాపో ఏ క్షణాన్నయినా ఈ సినిమా సెట్స్ మీదికెళ్లొచ్చు. వరుణ్ తేజ్ 10వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని అల్లు బాబీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.