కేజీఎఫ్... కన్నడ సినిమా రూపు రేఖల్ని మార్చిన సినిమా. దేశ వ్యాప్తంగా కళ్లు చెదిరే వసూళ్లు అందుకొంది. ఆ టేకింగ్, విజువలైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్... అన్నీ అల్టిమెట్. ఈ సినిమాని భాషకు అతీతంగా ఆదరించారు ప్రేక్షకులు. ఆ తరవాత కేజీఎఫ్ 2 కూడా వచ్చింది. దానికీ ఇలాంటి స్పందనే వచ్చింది. మొత్తంగా కేజీఎఫ్ ఓ చరిత్ర సృష్టించింది. అయితే ఇంతకాలానికి.. ఈ సినిమాపై తన అక్కసుని వెళ్లగక్కాడు వెంకటేష్ మహా. `కేరాఫ్ కంచరపాలెం` సినిమాతో మంచి దర్శకుడు అనిపించుకొన్నాడు మహా. ఆ తరవాత ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య సినిమా తీశాడు. రెండూ మంచి సినిమాలే. కాకపోతే.. కమర్షియల్ కంటెంట్ లేని సినిమాలు. కేజీఎఫ్ అలా కాదు... వందల కోట్లు కుమ్మరించింది. ఓ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ సినిమాపై తనకున్న అక్కసు మొత్తం వెళ్లకక్కాడు. అసలు అర్థం పర్థం లేని కథ ఇదని, ఎలా ఆడిందో అర్థం కాదని.. రకరకాల వెటకారపు వ్యాఖ్యలు చేశాడు. సినిమా నచ్చడం, నచ్చకపోవడం ఓ ఎత్తు. కానీ అందుకు వాడిన భాష మాత్రం సహేతుకమైనది కాదు. వెంకటేష్ వ్యాఖ్యలు కేజీఎఫ్ ఫ్యాన్స్‌ని హర్ట్ చేశాయి. దాంతో... వెంకటేష్ మహా ఇప్పుడు `సారీ` చెప్పాడు. కేజీఎఫ్‌పై తనకున్న అభిప్రాయంలో మార్పు లేదని, కానీ... వాడిన భాష సరైంది కాదని, ఓ దర్శకుడిగా అలాంటి భాషని వాడకుండా ఉండాల్సిందని తన తప్పు ఒప్పుకొన్నాడు.
నిజమే.. కోట్ల మందికి నచ్చిన సినిమా ఇది. కాకపోతే అందరికీ నచ్చాలన్న రూల్ లేదు. ఆ విషయాన్ని వెంకటేష్ మహా స్మూత్‌గా చెప్పి ఉంటే బాగుండేది. బంగారు గనుల గురించీ, అమ్మ క్యారెక్టర్ గురించీ, హీరో గురించీ అవహేళన చేస్తూ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు. `మేం కూడా ఇలాంటి సినిమాలు తీయగలం.. తీస్తే.. మామూలుగా ఉండదు..` అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకొన్నాడు మహా. తీయమనండి.. ఎవరు కాదన్నారు.. అన్నది కేజీఎఫ్ అభిమానుల మాట. ఇక ముందు మహా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా తేడా సినిమాలు తీసినా.. జనాలు వెంటనే మోసేస్తారు. ఈ ప్రమాదం మహాని పొంచి ఉంది.