త్వరలోనే ఏపీ, తెలంగాణలలో థియేటర్లు తెరచుకోబోతున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దరిమిళా.. అందుకు తగిన ఏర్పాట్లతో నిర్మాతలు సమాయాత్తం అవుతున్నారు. నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే... సినిమాలు రావడానికి రెడీ. అయితే... 50 శాతం ఆక్యుపెన్సీ అంటే చిన్న సినిమాలే రావాలి. పెద్ద సినిమాలు అంత రిస్క్ చేయవు. అందుకోసం ఆగస్టు వరకూ ఆగడానికైనారెడీనే. కాకపోతే... వెంకటేష్ మాత్రం `50 శాతం ఉన్నా ఫర్వాలేదు` అంటున్నాడట.
50 % ఆక్యుపెన్సీతో తన సినిమా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాడట. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఓ కొలిక్కి వచ్చేశాయి. మరో నాలుగైదు రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ. థియేటర్లు తెరచుకోగానే... వచ్చే తొలి సినిమా `నారప్ప`నే అని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదల చేసుకోవడానికి ఏ హీరో కూడా రెడీ గా ఉండడు.
కానీ వెంకీ మాత్రం అందుకు సిద్ధం అవుతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా విడుదల ఆలస్యం అవ్వడం వల్ల వెంకీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. వెంకీనే ఈ స్టెప్ తీసుకుంటే... మిగిలిన హీరోలూ ఈ దిశగా ఆలోచించడం మొదలెట్టడం ఖాయం.