ప్రస్తుతం ఆడియన్స్ ఆలోచనలు మారాయి. అందుకు తగ్గట్లుగానే దర్శక, నిర్మాతలు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటారా? తాజాగా విడుదలైన 'గురు' సినిమా ఈ తరహా చర్చలకు వేదికైంది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏదో సాదా సీదా కమర్షియల్ సినిమా కాదు. ఓ ప్రయోగాత్మక చిత్రమే. ఆడియన్స్ దీన్ని ఆదరించాలని కూడా లేదు. కానీ అమితంగా ఆదరిస్తున్నారు. అంటే అర్ధం చేసుకోవచ్చు. ఆడియన్స్ ఎలాంటి సబ్జెక్ట్స్‌ని కోరుకుంటున్నారో. గురు, శిష్యుల కధాంశంతో గతంలో చాలా కథలు తెరకెక్కాయి. కానీ 'గురు' సినిమా వాటిన్నింటికీ విభిన్నమైనది. రీమేక్ చిత్రమే అయినా కానీ చాలా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఓ స్టార్ హీరోతో కేవలం కమర్షియల్ చిత్రాన్ని మాత్రమే తెరకెక్కించి, మెప్పించగలం అనే ఆలోచన ఈ సినిమాతో మారిపోయింది. స్టార్ హీరో సినిమా అంటే ఖచ్చితంగా ఫైట్లు, హీరోయిన్‌తో రొమాన్స్, డ్యూయోట్స్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ కంపల్సరీ అనే ఆలోచన విడిచి, 'గురు' సినిమా ఓ మెట్టు ముందుకెక్కింది. కథతో సినిమాని ఎలా మెప్పించగలమో ఈ సినిమా ప్రూవ్ చేసి చూపించింది. 'దంగల్', సుల్తాన్' వంటి సినిమాలు కేవలం బాలీవడునలోనే ఎందుకు వస్తాయి. ఇకపై మన టాలీవుడ్‌కి కూడా ఆ తరహా సినిమాలను తెరకెక్కించగల సత్తా ఉందని చాటి చెప్పింది ఈ సినిమా. మొత్తానికి ఈ సినిమాతో కొత్త ట్రెండ్‌ని పరిచయం చేసిన వెంకీకి హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్‌గా నటించింది.