నటీనటులు : వెంకటేష్ నాగచైతన్య, పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా, నాజర్, ప్రకాష్ రాజ్, విద్యుల్లేఖ రామన్, రావు రమేష్, దాసరి అరుణ్ కుమార్, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకత్వం : కె ఎస్ రవీంద్ర(బాబీ)
నిర్మాతలు : సురేష్ బాబు, టి జి విశ్వప్రసాద్
సంగీతం : ఎస్ ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రేటింగ్: 3/5
బంధాల్ని తెరపై ఆవిష్కరించడం, వాటితో ఎమోషన్‌ని పండించడంలో తెలుగు దర్శకులు ఆరితేరారు. అయితే ఆ తరహా సన్నివేశాలు సినిమాలో ఒకట్రెండు ఉంటే సులభంగా గట్టెక్కేయొచ్చు. ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించొచ్చు. కానీ కథనే ఆ బంధం నేపథ్యంలో నడిపించాలన్నప్పుడే అసలు సిసలు సవాల్ ఎదురవుతుంది. దాన్ని ముందే గ్రహించింది బాబీ అండ్ బృందం. అందుకే జనార్ధన మహర్షి ఇచ్చిన మామా అల్లుళ్ల కథకి తనదైన శైలిలో రిపేర్లు చేసింది. జాతకాలు, సర్జికల్ స్ట్రయిక్ వంటి ఎపిసోడ్‌లు చేర్చింది. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు మెప్పించింది? సినిమాని ఎంతవరకు నిలబెట్టింది? తెలుసుకుందాం పదండి…
*కథ
వెంకటరత్నం నాయుడు అలియాస్ మిలట్రీ నాయుడు (వెంకటేష్) పది ఊళ్లని శాసించగల పెద్ద మనిషి. అతనికి మేనల్లుడు కార్తీక్ (నాగచైతన్య) అంటే ప్రాణం. తనకి అన్నీ తానై పెంచుతాడు. జాతకాల ప్రభావం కార్తీక్‌ని చిన్నప్పట్నుంచే వెంటాడుతుంటుంది. తన జాతకం వల్ల మేనమామకి కూడా గండం ఉందని తెలుస్తుంది. అప్పుడు కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? కార్తీక్ కోసం వెంకటరత్నం కశ్మీర్ ఎందుకు వెళ్లాడు? అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? నిజంగా వెంకటరత్నం నాయుడు గండం ఎదురయ్యిందా? నాయుడు, కార్తీక్‌లతో... వెన్నెల (పాయల్), హారిక (రాశిఖన్నా)లకి ఉన్న సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
*విశ్లేషణ
మామ కోసం అల్లుడు, అల్లుడు కోసం మామ. ఇదే ఈ సినిమా మూల కథ. కానీ దానికి చేసిన జోడింపుల వల్ల సినిమా నేపథ్యమే మారింది. అది చిత్రానికి కలిసొచ్చింది కూడా. జాతకాలు, కశ్మీర్ ఎపిసోడ్‌లతో సినిమాని మొదలుపెట్టారు. అక్కడ్నుంచి ఫ్లాష్‌బ్యాక్‌గా కథలోకి వెళ్లారు. అక్కడ మామా అల్లుళ్ల ఒక చోట చేరినప్పట్నుంచి కథ ఊపందుకుంటుంది.
ముఖ్యంగా మామా అల్లుళ్ల నేపథ్యంలో వచ్చే భావోద్వేగాలు, హాస్య సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలాన్నిచ్చాయి. వాళ్లిద్దరికీ కథానాయికలు తోడయ్యాక మరిన్ని నవ్వులు పండాయి. మామ కోసం అత్తని వెదికే ప్రయత్నంలో ఉన్న అల్లుడు చేసే ప్రయత్నాలు, అక్కడ పండే కన్‌ఫ్యూజన్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. తన అల్లుడు ప్రేమించిన అమ్మాయితో దూరమయ్యాడని తెలుసుకున్నమామ మళ్లీ వాళ్లిద్దరినీ ఒక్కటి చేయాలని ప్రయత్నించడం, అక్కడ కూడా కన్‌ఫ్యూజన్ మొదలవడంతో కామెడీ పండుతుంది. అలా రెండు ట్రాక్‌లు, మామా అల్లుళ్ల మధ్య భావోద్వేగాలతో ప్రథమార్థం ఆసక్తికరంగా ముగుస్తుంది. ద్వితీయార్థంలో ఇక చెప్పడానికి కథేమి లేదు. ఒకట్రెండు చిన్న ప్రశ్నలకి జవాబులు తప్ప. అవి కూడా ఊహించేలా ఉంటాయి.
దాంతో ద్వితీయార్థం మొత్తం మిలటరీ ఎపిసోడ్‌పైనే ఆధారపడాల్సి వచ్చింది. అది పండుంటే సినిమా మరోస్థాయికి వెళ్లేదే. కానీ తెలుగు సినిమా టెంప్లేట్ ప్రకారం ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. చనిపోయిన మనిషి తిరిగి బతకడం, ప్రేమ గొప్పతనం అని చెప్పడం... ఇలా తెలుగు సినిమాలోనే సాధ్యమనుకునే విషయాల్ని ఇందులో చూపించారు. దాంత పతాక సన్నివేశాలు ఏమాత్రం పస లేకుండా సాగుతాయి. కానీ బంధాల్ని కొత్తగా, ఓ కొత్త నేపథ్యంలో చూపించిన విధానం మాత్రం మెప్పిస్తుంది.
*నటీనటులు
వెంకటేష్ నటనే చిత్రానికి ప్రధానబలం. ఆయన పాత్రనిడిజైన్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఆయనకి తగ్గ భావోద్వేగాలు, కామెడీకి ఇందులో చోటుంది. దాంతో ఆయన రెచ్చిపోయారు. హావభావాలతోనే సన్నివేశాల్ని పండించే ప్రయత్నం చేశాడు. నాగచైతన్య అల్లుడిగా పాత్ర పరిధి మేరకు నటించారు. ప్రథమార్థంలో మామతో కలిసి నవ్వించే ప్రయత్నం చేశాడు. భావోద్వేగాలు బలంగా పండటంలోనూ వాళ్లిద్దరూ నిజ జీవిత పాత్రల్లో కనిపించడం కలిసొచ్చింది. రాశిఖన్నా, పాయల్ రాజ్‌పుత్ పాత్రలు ఆకట్టుకుంటాయి. కామెడీ పరంగా మంచి ప్రభావం చూపించాయి. రావు రమేష్ , దాసరి అరుణ్‌కుమార్లు వాళ్ల పాత్రల పరిధి మేరకు విలనిజం ప్రదర్శించారు. ప్రకాష్‌రాజ్, నాజర్, గీత తదితరుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆది, చమ్మక్ చంద్ర, విద్యుల్లేఖ రామన్ తదితరుల హంగామా మెప్పిస్తుంది.
*సాంకేతికత
సాంకేతికంగా సినిమా బాగుంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పల్లెటూళ్లతో పాటు, కశ్మీర్ అందాన్ని చాలాబాగా చూపించింది. తమన్ సంగీతం మెప్పిస్తుంది. దర్శకుడు బాబీ కథకుడిగా మంచి పనితీరుని ప్రదర్శించారు. ఆయన బృందం కథనం పరంగా చేసిన ప్రయత్నాలు మెచ్చుకోదగ్గవే కానీ, పతాక సన్నివేశాల విషయంలో చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. నిర్మాణం పరంగా సురేష్ ప్రొడక్షన్స్ మార్క్ కనిపిస్తుంది.
*ప్లస్ పాయింట్స్
వెంకటేష్
వినోదం
ఎమోషన్స్
*మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ద్వితీయార్థం
*ఫైనల్ వర్డిక్ట్: అమ్మ + నాన్న = వెంకీమామ