పూరి జగన్నాథ్ డ్రీంప్రాజెక్ట్ ‘జనగణమన'. ఆయన ఈ సినిమాని కొన్నాళ్ల క్రితమే విజయ్ దేవరకొండతో పట్టాలెక్కించారు. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డైలమాలో పడింది. ఇటీవలే విజయ్ - పూరిల కాంబినేషన్‌లో ‘లైగర్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇది బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని అందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జనగణమన’ లాంటి భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం మార్కెట్ పరంగా అంత శ్రేయస్కరం కాదని భావించిన పూరి జగన్నాథ్.. విజయ్‌తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్‌ను ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వచ్చాయి.
ఇప్పుడు ఆ వార్తలే నిజమైనట్లు విజయ్ దేవరకొండ మాటలు ప్రకారం అర్ధమౌతుంది . బెంగళూరులో సైమా పదో వార్షికోత్సవ వేడుకలకు విజయ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ‘జనగణమన' సినిమా గురించి ప్రశ్నించింది. అయితే విజయ్ ఈ సినిమా గురించి అడిగితే సమాధానం దాటవేశాడు. మనం వచ్చిన సైమా వేడుకలను ఎంజాయ్ చేయడానికి, దానికే పరిమితం అవుదాం అని అతను బదులిచ్చాడు. ఒక పెద్ద సినిమా చేస్తున్నపుడు సైమా లాంటి వేదికపై చెప్పుకుంటే చాలా మంచి ప్రమోషన్ వస్తుంది. కానీ విజయ్ మాత్రం సినిమా గురించి ప్రస్థావించడానికే ఇష్టపడలేదంటే ఇంక ‘జనగణమన' లేనట్లే అని అర్ధం చేసుకోవాలి.